టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. సీఎస్‌కు హైకోర్ట్ నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. సీఎస్‌కు హైకోర్ట్ నోటీసులు

April 7, 2022

7

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్రగ్స్ దిగుమతితో పాటు, మనీ లాండరింగ్‌ వ్యవహారం చేస్తున్నట్లు పోలీసులు చేసిన దర్యాప్తులో తేలినట్లు అప్పట్లో అధికారులు వివరాలను వెల్లడించారు. అయితే, వీటికి సంబంధించి, ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసును త్వరలోనే మూసేయాలని అధికారులు భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించే అవకాశముందని, 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో టాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో సుదీర్ఘంగా విచారణ సాగింది.

అయితే, తెలంగాణ హైకోర్ట్ ఈ డ్రగ్స్ కేసు విషయంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై గురువారం హైకోర్ట్ విచారణ జరిపింది. అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుంగా కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను ఈనెల 25కు హైకోర్టు వాయిదా వేసింది. డ్రగ్స్ కేసులో నిందితుల కాల్‌డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ గతంలో ఆరోపించింది. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించట్లేదని పేర్కొంది. దీనిలో భాగంగా సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.