Tollywood hero Chiranjeevi movie godfather first review umar sandhu
mictv telugu

పాత పచ్చడి.. గాడ్‌ఫాదర్ ఫస్ట్ రివ్యూ!

October 4, 2022

ఖైదీతో మెగాస్టార్ రీ ఎంట్రీ అద్దిరిపోయినా.. ఆ తరువాత కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి. సైరా పర్వాలేదనిపించినా.. ఆచార్య డిజాస్టర్ అయింది. దీంతో ఎలాగైన సత్తా చాటాలన్న ఉద్దేశంతో ‘గాడ్‌ఫాదర్‌’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు చిరంజీవి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకి తగ్గట్టే బాలీవుడ్, టాలీవుడ్ ప్రమోషన్స్‌ను పీక్స్‌లో చేస్తున్నాడు చిరంజీవి. ఆచార్య నష్టాలూ, ట్రోలింగ్ నుండి బయటపడాల్సిన చిరుకి ఖచ్చితంగా ఒక రావాల్సిన సమయంలో తాజాగా షాకింగ్ న్యూస్ ఒకటి తెగ కంగారు పెడుతోంది. ప్రతి సినిమాకి రెండు రోజుల ముందే రివ్యూ ఇచ్చే బాలీవుడ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు తన ఫస్ట్ రివ్యూతో మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. గాడ్‌ఫాదర్ ప్లాప్ అని తేల్చేశారు ఉమర్ సంధు. గాడ్‌ఫాదర్‌కు 2.5 రేటింగ్ ఇచ్చిన ఉమర్ సంధు.. మెగాస్టార్ సినిమాలు మానేయాలని అవమానకర కామెంట్స్ కూడా చేశాడు.

గాడ్‌ఫాదర్ గురించి ఉమర్ సంధు ట్వీట్ చేస్తూ.. ‘ఇదో యావరేజ్ మూవీ. మల్టిప్లెక్స్‌లో అయితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కేవలం బి, సి సెంటర్స్‌లోని మాస్ ఆడియన్స్ మాత్రమే గాడ్‌ఫాదర్‌ని చూస్తారు. కొత్త జాడీలో సిద్ధం చేసిన పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా. చిరంజీవి సినిమాలు మానేయడం మంచిది. గాడ్ ఫాదర్ చిత్రానికి నా రేటింగ్ 2.5\5’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆ నెగిటివ్ ముచ్చట వైరల్‌గా మారింది. అయితే గతంలో కూడా ఉమర్ సంధు అద్బుతమన్న సినిమాలు డిజాస్టర్ అవ్వటం.. బాలేదు అన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వటం జరిగాయి. ఆయన రేటింగ్స్ నమ్మడం మానేశారు జనాలు. అంతెందుకు తాజాగా మణిరత్నం క్లాసిక్ పొన్నియిన్ సెల్వన్ డిజాస్టర్ అంటూ రేటింగ్ ఇచ్చాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. ఈ క్రమంలో గాడ్‌ఫాదర్‌పై కూడా ఉమర్ సంధు రివ్యూని నమ్మొద్దంటున్నారు మెగా ఫ్యాన్స్. మలయాళం కంటే తెలుగు, హిందీలో గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. చూద్దాం మరి విజయదశమికి విడుదలవుతున్న గాడ్ ఫాదర్ ఎలాంటి విజయం సాధిస్తుందో.