సినీ నటుడు మంచు మనోజ్ మళ్లీ తన వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టారు. దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికా రెడ్డిని (ఆయన వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండో వివాహమే. మనోజ్, మౌనిక వివాహ వేడుక శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగింది. రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేసి ఆమెను భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు. మోహన్ బాబు దగ్గరుండి తన చిన్న కొడుకు రెండో పెళ్లిని ఘనంగా జరిపించారు. వివాహ వేడుకకు ఇటు మంచు కుటుంబ సభ్యులతో పాటు అటు భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. ఈ ఇరుకుటుంబాల సభ్యులే కాక ఫ్యామిలీ ఫ్రెండ్స్, సన్నిహితులు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా పెళ్లివేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మనోజ్‌కు 2015లోనే ప్రణతి రెడ్డితో వివాహమైంది. పరస్పర అంగీకారంతో 2019లో వారిద్దరూ విడిపోయారు. మౌనికా రెడ్డికి గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి. ఇటీవల తమ కుటుంబ సన్నిహితురాలు, తన స్నేహితురాలు భూమా మౌనికా రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. గతేడాది సెప్టెంబరులో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ వినాయక మండపానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. డిసెంబరులో కడప పెద్ద దర్గాను దర్శించుకున్న మనోజ్ ‘కొత్త జీవితం ప్రారంభిస్తున్నా’ అని అనడంతో అందరూ తన పెళ్లి గురించేనని ఫిక్స్ అయ్యారు. శుక్రవారం ఉదయం ‘పెళ్లి కూతురు’ అంటూ మౌనికా రెడ్డి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు మనోజ్.