సినిమా అంటే రంగుల ప్రపంచం. అందులో దూరాలంటే టాలెంట్ కచ్చితంగా ఉండాలి. అది ఉన్నా అవకాశాలు అంత సులభంగా రావనే సంగతి అన్నపూర్ణ స్టూడియో ముందు, కృష్ణా నగర్‌లో ఉంటున్న ఎవరిని అడిగినా చెప్తారు. కానీ టాలెంట్‌ని నమ్ముకోకుండా అడ్డదారులు తొక్కితే పరిణామాలు తర్వాత తీవ్రంగా ఉంటాయి. దానికి ఉదాహరణ అట్లూరి నవీన్ రెడ్డి. రూ. 55 కోట్ల చీటింగ్ కేసులో అరెస్టయిన నవీన్.. రూ. 38 కోట్ల మేర స్కాం చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజుల గూడెంకు చెందిన నవీన్ సినిమాల్లో రాణించాలని కలలు కన్నాడు. కానీ వాటిని నెరవేర్చుకునేందుకు అడ్డదారులు తొక్కి నమ్ముకున్న కంపెనీనే తాకట్టు పెట్టేశాడు.
ఎన్‌స్క్వేర్ సంస్థ పేరుతో సహ డైరెక్టర్ల సంతకాలను ఫోర్జరీ చేసి ఆ డబ్బులతో నోబడీ అనే సినిమా తీశాడు. మిగిలిన డబ్బులతో జల్సాలు చేసి ఖర్చు పెట్టేశాడు. అంటే నమ్మిన వాళ్లను నట్టేటా ముంచాడని అర్ధం అవుతోంది. ఈ విషయంపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్‌ని అరెస్ట్ చేసి గత రెండ్రోజులగా ఇంటరాగేట్ చేశారు. అందులో రూ. 38 కోట్ల వరకు ఫ్రాడ్ చేశానని ఒప్పుకున్నాడు. అటు అతని చరిత్ర తవ్వి తీయగా, గతంలో బైక్ దొంగతనం కేసులు ఉన్నాయని తేలింది.