Tollywood is in the hands of those families: Amalapal
mictv telugu

టాలీవుడ్‌‌పై అమలాపాల్ హాట్ కామెంట్స్..వాళ్ల చేతుల్లోనే

September 12, 2022

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ‘నాయక్’ సినిమాతో అడుగుపెట్టి, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘జెండాపై కపిరాజు’, ‘మేము’, ‘ఆమె’ వంటి చిత్రాలలో నటించి తన అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి అమలాపాల్. ఆమె తెలుగు సినిమాలతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించారు. అయితే, 2011 నుంచి 2015 మధ్య తెలుగులో సినిమాలు చేసిన తర్వాత టాలీవుడ్‌కు అమలాపాల్ దూరమైంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇంటర్వూలో అమలాపాల్ మాట్లాడుతూ..”తెలుగులో అతి తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలను నేను ఇప్పుడు వివరిస్తాను. నేను తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందన్న విషయం నాకు బాగా అర్థమైంది. కానీ, ఆ కుటుంబాల పేర్లు నేను చెప్పాను. అది అందరికీ తెలుసు. ఆ కుటుంబాలే చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వారు తీసే సినిమాలు కూడా భిన్నంగా ఉండేవి. వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు. వారిని గ్లామర్‌గా చూపిస్తూ, లవ్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారు. ఆ సినిమాలు చాలా కమర్షియల్‌గా ఉండేవి. అందుకనే నేను తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయాను” అని ఆమె అన్నారు.

అమలాపాల్ విషయానికొస్తే..పుట్టింది కేరళలోనే అయినా, తమిళ సినిమాతో ఆమె కెరియర్ ప్రారంభమైంది. అయితే, కెరియర్ ప్రారంభంలో ఆమె చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. ఆ తర్వాత చేసిన ‘మైనా’ సంచలనం సృష్టించింది. ఆ చిత్రం తర్వాత ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక తెలుగులో అమలాపాల్ చివరిసారిగా ‘పిట్టకథలు’ సినిమాలో కనిపించారు.