Tollywood Movie Ranga Ranga Vaibhavamga Review
mictv telugu

రంగ రంగ వైభవంగా రివ్యూ

September 2, 2022

పంజావైష్ణవ్ తేజ్, కేతికాశర్మ హీరో హీరోయిన్లుగా గిరీశాయ దర్శకత్వంలో వచ్చిన రంగరంగ వైభంగా మూవీ పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదలయింది. ట్రైలర్ తోనే సినిమా స్టోరీ రివీల్ చేసేశారు. ఈగో ఉన్న ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే కథ అని చెప్పేశారు. మరి సినిమాలో ఆ క్యారెక్టర్స్ నీ, కథని ఇంట్రస్టింగ్ గా చూయించారా అనేది ఇప్పుడు చూద్దాం.

 

మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తన మూడో మూవీగా ఈ ప్రాజెక్ట్ తోనూ స్టోరీ సెలక్షన్ లో వేరియేషన్ చూయించాడు. ఇక కథ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు వైజాగ్ లో పక్కపక్కనే ఇల్లు కూడా కట్టుకుని ఒకరింట్లో వండింది ఒకరు తినిపించుకుంటూ, కలిసి పండగలు పబ్బాలు చేసుకుంటూ, ఫ్యామిలీస్ పట్టుచీరలు పంచుకుంటూ ప్రపంచంలో అసలే సమస్యలు లేనట్టు హాయిగా ఉంటారు. ఇంతలో ఆ ఫ్యామిలీల్లో ఒకరింట్లో రిషి(వైష్ణవ్ తేజ్), మరొకరింట్లో రాధ (కేతికాశర్మ)ఒకేరోజు ఒకే టైమ్ కి పుడతారు. సరిగ్గా సమయం కూడా ఒంటిగంటా నలభై నిమిషాలని 143 అని చూయించి తన రైటింగ్ బ్రిలియన్స్ ని స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ గిరీశాయ. ఇక పద్నాలుగేళ్ల స్కూల్ ఏజ్ లోనే ప్రేమించేసుకోవడం కూడా స్టార్ట్ చేసి థియేటర్లో ఏమాయ చేశావె సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరీ హాయిగా సాగిపోతే కథలో కాన్ ప్లిక్ట్ ఉండదుగా. ఇక్కడే ఓ పిల్ల(ల) గొడవ పెట్టాడు డైరెక్టర్. ఆ ఫైట్ వల్ల చైల్డ్ హీరో హీరోయిన్ ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారు. ఇక ఈగో మొదలై నువ్వు ఫస్ట్ వచ్చి సారీ చెప్పేవరకూ నేను మాట్లాడను అంటూ ఇద్దరు శపథాలు చేసుకుని ఎంబీబీఎస్ చదివే ఏజొచ్చినా ఆ ఈగోని ఇష్టం లేకపోయినా కచ్చితంగా కంటిన్యూ చేస్తుంటారు. వాళ్ల వాళ్ల ఇళ్లల్లో కూడా వీళ్ల మాటలు లేని రిలేషన్ ని అర్థం చేసుకుని కథ కంటిన్యూ అవడానికి పాత్రల పరంగా తోచిన సాయం చేస్తుంటారు.

ఇలా బైటికి మాట్లాడుకోకుండా, మనసులో ప్రేమలున్నా చెప్పుకోకుండా ఇళ్లల్లో, కాలేజీలో కలిసే(?) గడిపే ఈ జంట కోపాలు చూయించుకుంటూ ఒకరిని ఒకరు డామినేట్ చేసుకునేందుకు పోటీల మీద ప్లానింగ్స్ వేస్తుంటారు. ఇంతా ఈగోలతో పదేళ్లపాటు మాట్లాడుకోని జంట మళ్లీ ఏ స్ట్రాంగ్ సీన్ కి కలిసిపోతారో అని ఆడియెన్స్ తెగ ఓపిక తెచ్చిపెట్టుకుని వెయిట్ చేస్తుంటారు. మరోవైపు పాలిటిక్స్ లో ఉంటూ పార్టీలో తన పదవిని లాగేసుకున్నాడని కోపంతో కేతికాశర్మ అన్నయ్యయిన నవీన్ చంద్ర మీద కోపంతో ఉంటాడు సుబ్బరాజు. ఓ అర్థరాత్రి కేతికను ఆటోలో ఎక్కించుకుని ఎత్తుకుపోతుండగా మన హీరో వచ్చి తనవంతు కర్తవ్యంగా తెలుగు సినిమా హీరో సూత్రాలననుసరించి అమ్మాయిని కాపాడేస్తాడు. అంతే.. సింపుల్. ఇద్దరి పెదాలతో పాటు మళ్లీ మాటలు కలిసిపోతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా పదేళ్ల గ్యాప్ ని ఫిల్ చేయడానికన్నట్టు ఓ రొమాంటిక్ సాంగ్. ఇక వీళ్లిద్దరూ పెరిగిన పెట్రోల్ రేట్లని కూడా ఖాతరు చేయకుండా హాయిగా లంబసింగి, వైజాగ్ బీచ్ అంటూ టూర్లు, షికార్లు ప్లాన్ చేసుకుంటారు. మరోవైపు వేరే ఊళ్లో ఓ పెళ్లికని వెళ్లిన హీరో హీరోయిన్ ఫ్యామిలీస్ కి మంత్రిగారు(నాగబాబు) కొడుకుతో సహా కనిపించి రేలంగి మావయ్యలా నవ్వుతూ పలకరిచి నాలుగు మంచి మాటలు మాట్లాడతాడు. వాళ్ల అబ్బాయి నవీన్ చంద్ర ఫ్రెండే కావడంతో తన పెద్ద చెల్లికిచ్చి పెళ్లిచేయాలనుకుంటాడు. వాళ్లు పొలోమని ఓ కారేసుకుని సంబంధం మాట్లాడడానికొస్తారు. ఇక మ్యాచ్ ఓకే అవుతుందనగా పెద్దచెల్లి నాకీ పెళ్లిష్టం లేదని అందరి ముందూ బాంబ్ పేలుస్తుంది. నేను రిషి(వైష్ణవ్ తేజ్) అన్నయ్య డీ..ప్ లవ్ లో ఉన్నాం అని ఓ తట్టుకోలేని సీక్రెట్ రివీల్ చేస్తుంది. దాంతో పరువు పోయిందనుకున్న నవీన్ చంద్ర తన చెల్లిని ప్రేమించిన రిషి అన్నయ్యని ఆఫీస్ కెళ్లి మరీ శక్తిమేర చితకబాదుతాడు.

తన ప్రేమ షికార్లు పూర్తిచేసుకుని సాయంత్రం తాపీగా ఇంటికి తిరిగొచ్చిన హీరోకి అసలు విషయం తెలిసి ఆగ్రహోదగ్రుడవుతాడు. బైటికి రారా నా కొడకా అంటూ బాహాబాహీకి దిగుతాడు. నన్నే కొడతావా, ఇకపై మన రెండు ఫ్యామిలీలకీ మాటల్లేవ్.. మాట్లాడుకోడాలు లేవ్, నా మాట దాటితే నన్ను దాటినట్టే అని అక్కడిక తీర్మానం చేస్తాడు. దాంతో అప్పటివరకూ హాయిగా కలిసిపోయిన ఆ రెండు కుటుంబాలు మొహాలు చూసుకోడానికి కూడా మొహమాటపడుతుంటారు. దీంతో మళ్లీ హీరో హీరోయిన్ కి గ్యాప్.

మరి వీళ్ల రిలేషన్ మళ్లీ ఎలా కంటిన్యూ అయింది? కష్టంగానే అయినా కథ కంచికెలా చేరిందనేదే సినిమా. ఈగో లవ్ స్టోరీ కాబట్టి అక్కడక్కడా ఖుషీ పోలికలు, అడపా దడపా నిన్నేపెళ్లాడతా, మధ్య మధ్యలో బొమ్మరిల్లు లాంటి సినిమాలు ఎంత వద్దనుకున్నా సగటు ఆడియెన్ కి సడన్ గా గుర్తొస్తాయి. అర్జున్ రెడ్డి ని తమిళ్ రీమేక్ చేసిన గిరీశాయ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కావడంతో అలాంటి కంటెంట్ ఎక్కడయినా ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. కేవలం హీరో హీరోయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్లనే తప్ప ఇంకెక్కడా అలాంటి పోలికలు కనిపించవు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ గా డీల్ చేశాడు దర్శకుడు. కలిసుంటే కలదు సుఖం అన్న కాన్సెప్ట్ తో బానే తెరకెక్కించాలని ట్రై చేశాడు. మరణ మాస్ యాక్షన్ సీన్లు, మైండ్ బెండింగ్ ట్విస్టులు, బ్రెయిన్ కి పనిచెప్పే స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు కాకుండా ఓ మామూలు ఫ్యామిలీ మూవీ చూడాలనుకునేవాళ్లు ఓసారి సరదాగా పొరపాటున కూడా ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూసేయొచ్చు.