టాలీవుడ్ సమ్మెకు తెర.. రేపట్నుంచి షూటింగులు షురూ - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్ సమ్మెకు తెర.. రేపట్నుంచి షూటింగులు షురూ

June 23, 2022

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న సినీ కార్మికులు ఎట్టకేలకు వారి ఆందోళనను విరమించారు. తప్పకుండా జీతాలు పెంచుతామని నిర్మాతల మండలి స్పష్టమైన ఇవ్వడంతో రేపటి నుంచి షూటింగ్ లలో పాల్గొనేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఓకే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జోక్యంతో సినీ కార్మికులు తమ సమ్మెను విరమించుకున్నారు.

అంతకుముందు ఈ నిరసనపై నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్‌ నాయకులు వేర్వేరుగా మంత్రి తలసానిని కలిశారు. అయితే మంత్రి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడంతో.. సినీ కార్మికుల సమస్యలు, వేతనాల పెంపుపై నిర్మాతల మండలితో సమారు 2గంటల పాటు చర్చించారు. కార్మికులకు ఇచ్చే జీతాలపై దిల్‌రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది. శుక్రవారం సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. కార్మికుల సమస్యలను సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకుంటామని, వేతనాల పెంపునకు నిర్మాతల మండలి అంగీకారం తెలపడంతో రేపటి నుంచి సినిమా చిత్రీకరణలు యథాతథంగా జరుగుతాయని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకులు తెలిపారు.