Tollywood new guidelines..no more daily wages
mictv telugu

టాలీవుడ్ కొత్త మార్గదర్శకాలు..ఇక రోజువారీ వేతనాలు ఉండవు

September 3, 2022

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, కొత్త మార్గదర్శకాలను రూపొందినట్లు పేర్కొంది. తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి, అన్నీ సమస్యలను పరిష్కారించే దిశగా ముందకెళ్తున్నామని, ఈ క్రమంలో సెస్టెంబర్‌ 1వ తేదీ నుంచి చిత్రీకరణను పునః ప్రారంభించామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు.

1. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు.
2. నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బందికి వేతనాలు చెల్లించుకోవాలి.
3. స్థానిక రవాణా, బస, స్పెషల్‌ ఫుడ్‌ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి.
4. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు.
5. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి” అని పేర్కొంది.

అంతేకాకుండా, ‘సినిమా షూటింగ్‌‌కి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. కాల్షీట్స్‌ టైమింగ్, సెట్స్‌లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఇక, ఓటీటీ విషయానికొస్తే.. ఓ సినిమా ఏ టీవీ చానెల్‌లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది? అనే అంశాలను టైటిల్స్‌లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్‌లో కానీ బహిర్గతం చేయకూడదు. థియేటర్స్‌లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాలి’ తెలియజేసింది.

ఇక, చివరగా సినీ కార్మికుల విషయంలో తలెత్తిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయని, రేట్‌ కార్డ్స్‌ ఫైనలైజ్‌ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుందని పేర్కొంది. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని, కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని, త్వరలోనే ఈ కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ అధికారికంగా పంపనుందని సమాచారం.