Tollywood new trend remastered for theatrical re-release
mictv telugu

రీ-రిలీజ్ ట్రెండ్ వెనుక.. రహస్యం ఇదే..

October 3, 2022

Tollywood new trend remastered for theatrical re-release

కోవిడ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకున్నప్పటికీ థియేటర్ల యజమానుల్లో భయం తగ్గలేదు. కిక్కిరిసిన జనాలు, ఉత్సాహభరిత వాతావరణం, అభిమానుల కోలాహలం, హౌస్‌ఫుల్ బోర్డులు, వెండితెరపై సినిమాని వీక్షిస్తూ చేసే ఈలలు, గోలలు అలాంటి పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలమా అన్న అనుమానం అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ షోల పేరుతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో రిలీజైన బ్లాక్ బస్టర్ సినిమాలకి అత్యాధునిక సాంకేతికత టచ్‌తో ఆధునీకరించి మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. దీన్నే ‘థియేట్రికల్ రీ రిలీజ్’ అంటున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు కూడా ఈ పద్దతిలో రిలీజ్ చేశారు. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన కూడా వచ్చింది. నిస్తేజంగా ఉన్న థియేటర్‌లకి ఈ కొత్త ట్రెండ్ సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా BookMyShow ప్లాట్‌ఫారమ్‌ల టికెట్స్ తెగ తెగుతున్నాయి.

ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం విడుదలైన మహేష్ బాబు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘పోకిరి’ చిత్రం యుఎస్‌లో 4కె టెక్నాలజీలో రీమాస్టర్ చేసి మళ్లీ విడుదల చేయడంతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. పోకిరి ప్రీ-బుకింగ్స్ కి ఆడియన్స్ స్పందన చూసి మేకర్స్ ఆశ్చర్యపోయారు. పోకిరి టిక్కెట్లు గంటలోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మనదేశంలోనూ అదే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఇండియాలో తిరిగి రీ రిలీజ్ చేశారు. ఇక పోకిరి తరువాత జల్సాని కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ 1న రీ-రిలీజ్ అయిన జల్సాకు రెండు రోజుల పాటు స్పెషల్ షోలు వేశారు. ఆ తరువాత బాలయ్య బ్లాక్ బస్టర్ ‘చెన్నకేశవ రెడ్డి’ సెప్టెంబర్ 24న 4k లో తిరిగి విడుదలవ్వగా.. ప్రభాస్ బిల్లా అక్టోబర్ 23న విడుదల కానుంది. అయితే స్టార్ హీరోల పుట్టిన రోజుల సందర్భంగా వేస్తున్న ఈ సినిమాల థియేట్రికల్ రీ రిలీజ్ వెనుక ప్రధాన కారణం భారీ బిజినెస్. థియేటర్స్‌కి ఆడియన్స్ రప్పించే ప్రయత్నం, ఫ్యాన్స్‌ను ఉత్తేజపరచటమే కాకుండా.. రీ రిలీజ్ కి అద్దిరిపోయే లాభాలు వస్తున్నాయట.
ఒక సినిమాను రీమాస్టర్ చేయడానికి అయ్యే ఖర్చు దాదాపు రూ. 5-8 లక్షలు అయితే.. లాభాలు కోట్లల్లో వస్తున్నాయట. 320 షోలు పడ్డ పోకిరి ఒక్క రోజులో దాదాపు 1.75 కోట్లు వసూలు చేసింది. ఇక జల్సా రెండు రోజుల్లో 500+ షోలు వేస్తే.. 3.25 కోట్లు వసూలు చేసింది. ఈ రీ రిలీజ్ బిజినెస్ చిన్న సినిమాల బ్లాక్ బస్టర్ వసూళ్ల మాదిరి ఉండటంతో.. భవిష్యత్ లో ఇది ఒక ట్రెండ్ సెట్ చేయనుందని అంటున్నారు. దీంతో ప్రొడక్షన్ హౌస్‌లు గతంలో విడుదలైన సినిమాలను డిజిటలైజ్ చేయడమే కాకుండా పాత సినిమాల ప్రింట్‌లు, అరిగిపోయిన వాటిని కూడా పునరుద్ధరిస్తున్నాయి. భవిష్యత్తులో మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉన్న హిట్ సినిమాల్లో చిరంజీవి ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి, సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం, అల్లూరి సీతారామరాజు.. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి, మహేష్ బాబు అతడు, ఖలేజా.. వెంకటేష్ క్షణ క్షణం వంటి సినిమాలు రీమాస్టర్ అవుతున్నాయి.

పాత సామాన్ల వ్యాపారం లాంటిందే ఇది. కాకపోతే కొత్త టెక్నాలజీ టచ్ ఇచ్చి ఫ్యాన్స్ అభిమానమే పెట్టుబడిగా దుమ్మురేపేస్తున్నారు.