హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్2’ సినిమాపై మరోసారి కామెంట్ చేశారు టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం ‘బుట్టబొమ్మ’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగవంశీ.. సారి ‘అవతార్2’ గురించి ప్రస్తావించారు. అవతార్ 2 తనకు నచ్చలేదని చెప్పినప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు తనను తప్పుబట్టారన్నారు. సినిమా అనేది అందరికీ నచ్చేలా ఉండాలన్న రూల్ ఏం లేదని.. అలాంటిది నచ్చలేదని చెప్పినప్పుడు ఎందుకంత వ్యతిరేకత వస్తుందో తనకు అర్ధం కావట్లేదన్నారు. మూడు గంటల సేపు థియేటర్ లో కూర్చోబెట్టి ఏవేవో చూపిస్తే వాటిని విజువల్ వండర్ అనాలా? అని ప్రశ్నించారు. అంతసేపు ఆ సినిమాను చూడలేకపోయానని చెప్పారు. “మన దగ్గర ఉన్న త్రివిక్రమ్, రాజమౌళి లాంటి దర్శకులు సినిమాలు తీస్తే అవి బాలేవని చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది మనకు తెలియని, ఎక్కడో ఉన్న జేమ్స్ కామెరూన్ సినిమా నాకు నచ్చలేదంటే అందరూ ఎందుకు అంతలా బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు’’ అన్నారు. దీంతో మరోసారి నెటిజన్లు అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
‘‘త్రీడీలో చిత్రీకరించారు కాబట్టి ఈ సినిమాను విజువల్ వండర్ అనాలి. బ్లాక్ బాస్టర్ అని మెచ్చుకోవాలి. లేకపోతే నా సినిమాలను ఆదరించరు’’ అని అవతార్ 2 విడుదలైన సమయంలో నాగవంశీ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే లేపింది. తాజాగా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశారు. రెండ్రోజులక క్రితం తన తర్వాతి సినిమాలో హీరోయిన్స్ గురించి బయట వినిపిస్తున్న మాటలపై కూడా కౌంటర్ వేశాడు నాగవంశీ. తన సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటించనుందంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సెకండ్ హీరోయిన్ అంటే ఏమిటి? వీళ్లు ఫస్ట్, వాళ్లు సెకండ్ అంటూ మేము ఏ హీరోయిన్‌కీ నంబర్స్ ఇవ్వలేదు.. అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతం నాగవంశీ నిర్మిస్తున్న ‘బుట్టబొమ్మ’సినిమా జనవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య, వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకాదరణ పొందింది.