టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ(87) మరణించిడంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ మరణంతో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రేపు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మా అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉంచనున్నారు.
మరణానికి కారణమిదేనా..
కైకాల సత్యనారాయణ గతేడాదిలో కరోనాకి గురయ్యారు అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో ఆయన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన సోదరుడు, నిర్మాత నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల కూడా అదే కారణంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. కొంత కాలంగా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇప్పుడు అన్నయ్య మరణించడం బాధిస్తోందన్నారు.
వెండితెర యముడు
ఏ పాత్రలోనైనా ఇట్టే ఇముడిపోయే కైకాల సత్యనారాయణ మొత్తం 60 ఏళ్ల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,హాస్యనటుడిగా ఆయన నటనను తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేరు. ఎన్టీఆర్ ‘యమగోల’ సినిమాలో కైకాల పోషించిన యమధర్మరాజు పాత్రను చూస్తే అచ్చం పైన యుమడే దిగి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ పాత్ర ఆయనకు మరింత ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. యముడు అంటే కైకాల సత్యనారాయణే అనేలా చేసింది.