టమాటో వైరస్.. లక్షణాలు ఇవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

టమాటో వైరస్.. లక్షణాలు ఇవీ..

May 12, 2022

కేరళలో కొత్త రకం వైరస్ అక్కడి ప్రజలను కలవరపెడుతున్నది. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల టమాటో ఫ్లూ అనే వైరస్‌ వెలుగుచూసింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా చిన్నారులు డీ హైడ్రేషన్, దగ్గు, జలుబు, డయేరియా, చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చర్మంపై టమాటో ఆకారంలో బొబ్బలు వస్తుండటంతో దీనికి టమాటో ఫ్లూ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొల్లం ప్రాంతంలో 80 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు అధికారులు చెప్తున్నారు.

ప్రసుత్తానికి ఆందోళనకర పరిస్థితులు లేకున్నా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, చర్మంపై బొబ్బలు వస్తే ఆశ్రద్ధ చేయవద్దని, ఫ్లూ బారిన పడిన వారికి దూరంగా ఉండటం వంటివి పాటించాలని సూచిస్తున్నారు. టమాటో ఫ్లూ నేపథ్యంలో కేరళ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో భాగంగా కేరళ-తమిళనాడుల సరిహద్దు పట్టణమైన వలయార్‌లో జ్వరం, దద్దుర్లు, ఇతర లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు పరీక్షలు చేపట్టారు.