టమాటకు రెక్కలు.. కిలో రూ.100 - MicTv.in - Telugu News
mictv telugu

టమాటకు రెక్కలు.. కిలో రూ.100

May 15, 2022

దేశ వ్యాప్తంగా గతకొన్ని నెలలుగా మార్కెట్లో ధరలు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, చికెన్, మటన్‌ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. దాంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడి ఆదివారం రోజున చికెన్ గాని మటన్ గాని తిందామనుకుంటే మార్కెట్‌లో చికెన్‌కు, మటన్‌కు పెరిగిన ధరలను చూసి పప్పు సాంబార్‌తోనే సర్థి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో టమాటాల వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంట గదిలో ఉల్లిపాయలు, టమాటా లేకుంటే ఆరోజే గడవదు. నిత్యం ఏదో ఒక కూర చేస్తూనే ఉంటారు. మరికొందరు రోజుకు రెండు నుంచి మూడు కూరలు చేస్తుంటారు. ఆ కూరల్లోకి కచ్చితంగా టమటా కావాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో టమాట ధర ఆకాశానికి ఎక్కింది. మదనపల్లె మార్కెట్ రేటు ప్రకారం.. కిలో రూ.70. కానీ, చిరు వ్యాపారులు మాత్రం నాణ్యత పేరు చెప్పి కిలో రూ.80 నుంచి రూ.100కి చేర్చారు.

ఇక, మార్కెట్లో హోల్‌సేల్ విషయానికొస్తే.. కిలో టామాట ధర 70 పలుకుతుంటే, వ్యాపారులు మాత్రం కిలో 80 నుంచి 100కు అమ్ముతున్నారు. నాణ్యత కలిగిన టమాటాలు అంటూ గల్లీ వ్యాపారులు కిలో రూ.100కి చేర్చారు. శనివారం చిత్తూరు జిల్లా రామకుప్పం మినీమార్కెట్ యార్డులో 15 కిలోల బాక్సు ధర గరిష్ఠంగా రూ.1150 , వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో రూ.1000 వరకు పలికింది. నాణ్యతను బట్టి రూ.850 నుంచి రూ.1150 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు.