జార్జిరెడ్డి రేపు మళ్ళీ పుడుతున్నాడు.. సమాధి వద్ద మూవీ యూనిట్ - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి రేపు మళ్ళీ పుడుతున్నాడు.. సమాధి వద్ద మూవీ యూనిట్

November 21, 2019

George Reddy ....................

ఎన్నో అంచనాలు, వివాదాల నడుమ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘జార్జిరెడ్డి’. ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘వంగవీటి’ ఫేం సందీప్ మాధవ్ ముఖ్య పాత్రలో నటించారు. సినిమా విడుదల సందర్భంగా అసలైన కథానాయకుడు జార్జిరెడ్డి సమాధిని చిత్రయూనిట్‌ సందర్శించారు. నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘1960, 70 దశకంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జార్జిరెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. 25 ఏళ్ళకే జార్జిరెడ్డి ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జార్జిరెడ్డి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను తెలుసుకోవడానికి, వీడియోలను సమకూర్చుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. వాటి ఆధారంగానే ఈ సినిమాను తీశాం. ఆయన జీవిత చరిత్రను క్షణ్ణంగా తెలుసుకున్నాక ఐదేళ్లుగా ఏ సినిమాను చేయలేదు. ఆయన నిజాయితీని చెప్పేందుకు ఈ సినిమా తెరకెక్కించాం. రేపు జార్జిరెడ్డి మళ్ళీ పడుతున్నాడు. ఆయన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి’ అని ఆయన తెలిపారు.
సమాజం జార్జిరెడ్డి లాంటి వాళ్ళను చాలామందిని కోల్పోయింది, ఎలా కోల్పోయామో, ఎందుకు కోల్పోయామో తెలిపేందుకే ఈ సినిమాని నిర్మించామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇదిలావుండగా జార్జిరెడ్డి సినిమా ఓ వర్గాన్ని అవమానించేలా తెరకెక్కించారని కొంత మంది అభ్యంతరం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఏబీవీపీ నాయకులు సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూఏ సర్టిఫికెట్‌ అదించింది. టాలీవుడ్ నుంచి కూడా ఈ సినిమాకు భారీ స్పందన వస్తోంది. చరిత్ర మరిచిన వీరుడి కథను సినిమాగా తీసి ఈ తరానికి తెలియజెప్పడం హర్షణీయం అని పరిశ్రమ పెద్దలు కొనియాడుతున్నారు.