రేపటితో మునుగోడు ప్రచారానికి తెర… రూ. 6.80 కోట్ల నగదు సీజ్
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి మంగళవారంతో తెరపడనుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోయిన నాయకులు రేపటితో గుప్ చప్ కానున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ప్రచారం ముగిశాక మునుగోడులో స్థానికేతరులు ఎవరూ ఉండొద్దని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాశ్ రాజ్ ఆదేశించారు. రేపు సాయంత్రం తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం చేయరాదని..నియోజకవర్గంలో విస్తృత తనిఖీలు చేస్తామని తెలిపారు. గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో రూ. 6.80 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. 4500 లీటర్ల మద్యం సీజ్ చేశామని వికాశ్ రాజ్ వెల్లడించారు.
ఇక పోలింగ్ కు ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మెడికల్ టీమ్స్ ను అందుబాటులో ఉంచారు. నియోజకవర్గం పరిధిలో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 5,686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నప్పటికీ, కేవలం 739 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 ఉన్నాయి.. అర్బన్‌లో 35, రూరల్‌లో 263 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాట్లు చేసారు. 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. తొలిసారి కొత్త నమూనా ఓటరు కార్డులను పంపిణీ చేసారు అధికారులు. 3,366 పోలింగ్ సిబ్బంది, 15 బలగాల సిబ్బందిని మునుగోడులో మోహరించారు