ఐపీఎస్ మూఢనమ్మకం.. తండ్రి శవానికి ఆయుర్వేద చికిత్స - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎస్ మూఢనమ్మకం.. తండ్రి శవానికి ఆయుర్వేద చికిత్స

March 14, 2019

ఏం తెలియనివాళ్ళు వెల్లకిలా పడ్డారంటే ఏమైనా అనుకోవచ్చు కానీ అన్నీ తెలిసినవాళ్ళు కూడా బొక్క బోర్లా పడటం అంటే కాస్త చోద్యంగానే వుంటుంది. చనిపోయిన వ్యక్తిని బతికించడం వందకు వందశాతం సాధ్యంకాదు అని సైన్స్ తేల్చి చెప్పింది. కానీ ఓ ఐపీఎస్ అధికారి మాత్రం చచ్చిన వ్యక్తిని బతికించడానికి ఆయుర్వేద వైద్యం చేయిస్తున్నాడు. అదీ అతని తండ్రి శవానికే అవడం విశేషం. తండ్రి చనిపోయి రెండు నెలలు అవుతోంది. వైద్యులు డెత్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. కానీ తండ్రి శవానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లో పెట్టుకుని ఆయుర్వేద వైద్యుల చేత వైద్యం చేయిస్తున్నాడు. ఆయన బాగా చదువుకున్న ఐపీఎస్ అధికారి అవడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర మిశ్రా అనే ఐపీఎస్‌ అధికారి తండ్రి(84) ఈ ఏడాది జనవరి 14న మరణించాడు. ఆయన చనిపోయారని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు డెత్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. కానీ రాజేంద్ర మాత్రం చనిపోయిన తన తండ్రిని బతికించుకోవాలని అనుకున్నాడు. రెండు నెలలుగా ప్రభుత్వ బంగళాలో తండ్రి మృతదేహానికి చికిత్స చేయిస్తున్నాడు. తల్లి, సోదరులతో పాటు వైద్యం చేసే వ్యక్తిని మాత్రమే ఆ గదిలోకి అనుమతిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మానవహక్కుల కమిషన్‌ రాజేంద్ర ఇంటికి వైద్యులను పంపి.. పరీక్షించడానికి ప్రయత్నించింది. కానీ అతను వారిని లోపలికి అనుమతించలేదు.

Top cop keeps father s body for a month says being treated by ayurvedic doc.

నాన్న యోగీంద్రుడు..

‘మా నాన్న ఆరు దశాబ్దాలుగా యోగా చేస్తున్నారు. ఆయన యోగీంద్రుడు. ఈ ప్రపంచంలో శాస్త్రానికి అందని విషయాలు చాలా ఉన్నాయి. అల్లోపతి వైద్యమే ఆఖరు కాదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్లు మా నాన్న మరణించాడనే అనుకుందాం. మరి ఇప్పటి వరకూ ఆయన శరీరం కుళ్లిపోలేదు ఎందుకు. మృతదేహానికి వైద్యం చేయడం అసాధ్యం కానీ నాన్న శరీరం వైద్యానికి స్పందిస్తోంది కాబట్టి ఈ పనికి పూనుకున్నాం. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.

ఒకవేళ ప్రభుత్వం పంపే డాక్టర్లు ఆయనను మేల్కొల్పడానికి ప్రయత్నించినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి.. ఆయనకు ఏమైనా అయితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు. అలా జరిగితే.. దాన్ని హత్య అంటూ కేసు పెట్టవచ్చా?’ అని అన్నారు. ఈ విషయంలో రాజేంద్ర తల్లి ఇతరులు జోక్యం చేసుకోకుండా చూడమంటూ మానవ హక్కులు కమిషన్‌ను ఆశ్రయించారు.