తోక ముడిచిందనని ఊపిరి పీల్చుకుంటున్న మానవాళి నెత్తిన పిడుగు పడబోతోంది! కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగనున్నాయని ఓ వైద్య నిపుణుడు హెచ్చరించాడు. చైనాలో వచ్చే మూడు నెలల్లో ఏకంగా 80 కోట్లమందికి కోవిడ్ సోకనుందని అమెరికాకు చెందిన ఎరిక్ ఫీగల్ డింగ్ అనే అంటువ్యాధుల నిపుణుడు, ఆరోగ్య విషయాల ఆర్థిక నిపుణుడు హెచ్చరించాడు. చైనాలో ఇప్పటికే వేల కేసులు నమోదై, ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిన నేపథ్యంలో డింగ్ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘చైనా జనాభాలో 60 శాతం మంది కరోనా బారిన పడబోతున్నారు. అంటే భూమిపై ఉన్న జనాభాలో 10 శాతం మందికి జబ్బు సోకనుంది. మరణాలు పదుల లక్షల్లోనే ఉంటాయి. అయినా చైనాకు ఏమీ పట్టడం లేదు’’ అని డింగ్ చెప్పారు. ‘‘ఎంతమందికి సోకితే అంతమందికి సోకాలి. చావాలి. కేసులు, చావులు త్వరగా ముగిసిపోవాలి. మళ్లీ త్వరగా పనులు మొదలు కావాలి. అన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ ఆలోచన. బీజింగ్‌లో వేల మరణాలు సంభవిస్తున్నాయి. మార్చురీల్లో వేల శవాలు నిండిపోయాయి’’ అని డింగ్ చెప్పారు. అయితే కేసులు నియంత్రణలోనే ఉన్నాయని చైనా చెబుతోంది. అనధికారిక వార్తల ప్రకారం చైనాలో రోజూ 10 వేల కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో కిక్కిరిసిన పేషన్లు, మార్చురీల దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.