వేలం వెర్రి.. హిట్లర్ టోపీకి రూ.40 లక్షలు  - MicTv.in - Telugu News
mictv telugu

వేలం వెర్రి.. హిట్లర్ టోపీకి రూ.40 లక్షలు 

November 22, 2019

మంచో, చెడో చరిత్రకెక్కినవారి గురించి ఎప్పుడు చెప్పినా అది కొత్తగానే ఉంటుంది. అలాంటివారు ధరించిన వస్తువులు, వస్త్రాలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అలా చరిత్రలో నియంతలా తన పేరు లిఖించుకున్న అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన కొన్ని వస్తువులను వేలం వేశారు. వాటిని చేజిక్కించుకోవడానికి చాలామంది పోటీలు పడ్డారు. ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి వెనకాడలేదు. హిట్లర్‌ చనిపోయి 74 సంవత్సరాలు అవుతోంది. ఆయన ధరించిన కొన్ని వస్తువులను మ్యానిచ్‌  ప్రాంతంలోని ఒక మ్యూజియంలో భద్రపరచారు. ఇంతకాలానికి ఆయన వస్తువులను వేలం వేశారు.

Hitler.

ఆయన బతికున్నప్పుడు తరచూ ధరించే టోపీతో పాటు నాజీకి సంబంధించిన వస్తువులను బుధవారం ఆన్‌లైన్‌లో వేలం వేశారు. వీటిని చేజెక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎగబడ్డారు. కానీ, టోపీని దక్కించుకునే ఛాన్స్ ఒక్కరికే దక్కింది. అతని పేరు అబ్దుల్లా చతీలా. స్విట్జర్లాండ్‌కు చెందిన అతను వ్యాపారస్తుడు. ఆ టోపీని వేలంలో 50 వేల యూరోలకు (సుమారు రూ. 40లక్షలు) దక్కించుకున్నాడు. అయితే దీనిని ఇజ్రాయెల్ నిధుల సేకరణ సంస్థ అయిన కెరెన్ హేసోడ్కుకు విరాళంగా ఇచ్చాడు. అయితే ఆఫర్‌లో ఉన్న మిగతా నాజీ వస్తువులను మాత్రం పొందలేకపోయాడు. నాజీ వస్తువులను చేజిక్కించుకోవడానికి ఇతరులు కూడా భారీ మొత్తంలోనే సమర్పించుకున్నట్లు సమాచారం. 

కాగా, హిట్లర్ రెండో ప్రపంచ యుద్దం జరగడంలో ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నాజీ వ్యవస్ధాపకుడైన హిట్లర్‌ జర్మనీకి ఒక నియంతలా వ్యవహరించాడు. అందరి మాటను పెడచెవిన పెడుతూ తన చావును తానే కొనితెచ్చుకున్నాడు.