ఎండకు వానకు తడిసి కష్టపడి పనిచేసే శ్రామిక జీవుల కష్టం ఒకెత్తు అయితే.. చల్లగా ఏసీ రూముల్లో కూర్చుని కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగాలు చేసేవారి కష్టం మరొక ఎత్తు. ఇలా చెప్పుకుంటూ పోతే చేసే పనులు ప్రపంచంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవేవీ లేకుండా కొందరు కేవలం నాలుకతో రుచి చూసి ఎలా ఉందో చెప్పి కళ్లు చెదిరే జీతాన్ని పొందుతున్నారు. అలా రుచి చూసినవారు లక్షల్లో సంపాదిస్తున్నారంటే నమ్మగలరా. ఇలాంటి ఉద్యోగాలు టీ, కాఫీ తయారీ చేసే పరిశ్రమల్లో ఎక్కువగా ఉంటాయి. వాటిని టేస్ట్ బడ్స్ జాబ్స్ అంటారు. మరోపక్క ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి. నిస్సిన్ సంస్థకు చెందిన టాప్ రామెన్ నూడిల్స్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ కళ్లు చెదిరే జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది.
చీఫ్ నూడిల్ ఆఫీసర్ పోస్ట్‌ను ప్రకటించింది. ఈ ఉద్యోగానికి పెద్దగా చదువు అక్కర్లేదని.. నూడిల్స్ రుచి చూసి ఎలా ఉందో చెప్తే చాలు అని స్పష్టంచేసింది. ఈ ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాలి అనుకునేవారు టాప్ రామెన్ కంపెనీ నూడిల్స్‌ను వెరైటీగా, సింపుల్‌గా ఉండే విధంగా వండి, దానికి సంబంధించిన లింక్‌కు #HowDoYouTopRamen అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపింది. ఆ పోస్ట్‌లో @OriginalTopRamen, @ChefMelissaKing అనే వాటికి ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని వివరించింది. అలాగే టాప్ రామెన్ కంపెనీ ఎందుకు మీకు ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటుందో తెలియజేస్తూ రెండు లైన్లలో రాసి దానిని కంపెనీకి మెయిల్ చేయాలని పేర్కొంది. ఈ టాప్ రామెన్ చీఫ్ నూడిల్ ఆఫీసర్ పదవికి ఎంపికైన ఉద్యోగికి 10వేల డాలర్ల జీతంతో పాటుగా, 50 ఏళ్లపాటు టాప్ రామెన్ నూడిల్స్‌ను ఉద్యోగి ఇంటికి ఉచితంగా పంపనున్నట్టు సంస్థ తెలిపింది. కాగా, ఇలాంటి జాబ్స్ ఇంట్లో అమ్మలక్కల వంటలకు ఇది బాగాలేదని, అది బాగాలేదని సవాలక్ష పేర్లు పెట్టేవారికి చక్కగా నప్పుతాయని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.