మసాలాలో తెలంగాణ టాప్.. ఏటా ఒక్కొక్కరు 7.5 కేజీలు - MicTv.in - Telugu News
mictv telugu

మసాలాలో తెలంగాణ టాప్.. ఏటా ఒక్కొక్కరు 7.5 కేజీలు

October 14, 2019

‘ఎహె నాటుకోడి కూర సప్పసప్పగ వండితే నోటికి రుచి వుండది. మాంచిగ మసాలాలు అద్ది, నోటి నిండ ఉప్పూ కారం ఏస్తే.. నాసామిరంగా కూరల బొక్క గూడ మిగలదు’  తెలంగాణవాళ్లు ఇలా ఘాటుగా నాటుగా తినడానికి అస్సలు వెనకాడరు. పండగలు పబ్బాలు, దావత్‌లల్లో నాన్‌వెజ్ కూరలు మసాలా వాసనతో ఊరందరినీ ఊరించినంత పనే చేస్తాయి. లవంగాలు, యాలకులు, శాజీర, దాల్చిన చెక్క, మార్వాడీ మెంతెంలతో బగార బువ్వ, మటన్ కూరలు కుతకుతలాడిపోతుంటాయి. దీంతో దేశంలోనే మసాలాలు ఎక్కువ తినే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు బద్దలు కొట్టింది.  దేశంలోని ఆయా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మసాలా దినుసుల వినియోగం అధికంగా ఉందని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వేలో తేలింది. ధనియాలు, జీలకక్ర, మెంతులు, సోంపు, వాము వంటి 17 రకాల ఉత్పత్తుల వినియోగం తెలంగాణలోనే అధికంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.

 తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఎఎఆర్‌ఎం సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో ఒక వ్యక్తి సగటున రోజుకు 21 గ్రాములు, నెలకు 640 గ్రాములు, సంవత్సరానికి 7.58 కిలోల సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలింది. సంవత్సరానికి 2.31 లక్షల మెట్రిక్‌ టన్నుల సుగంధ ద్రవ్యాలను తెలంగాణ ప్రజలు వినియోగిస్తుట్టు సర్వేలో తేలింది. వీటి విలువ రూ.1451 కోట్లు అని నిపుణులు తేల్చారు. వాటిలో  అల్లం, వెల్లుల్లి, పసుపు, ఎండు మిర్చి, చింత పండు వంటి ఉత్పత్తుల పరిమాణం 2,02,890 మెట్రిక్‌ టన్నులుగా అంచనా వేశారు. వీటి విలువ విషయానికి వస్తే రూ. 1251 కోట్ల మేర ఉంటుందని స్పష్టంచేశారు. ఇక విత్తన సుగంధ ద్రవ్యాల పరిమాణం 28,200 మెట్రిక్‌టన్నులు ఉంటుందని తేల్చారు. దీని విలువ 200 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.

Masala.

అయితే రాష్ట్రంలో పసుపు, ఎండుమిర్చి వంటివి అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నట్టు సర్వే వెల్లడించింది. విత్తన సుగంధ ద్రవ్యాలైన ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు వాము వంటి పంటలను పండించకపోవడంతో వీటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలంగాణ ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొన్నారు.  గుజరాత్‌, రాజస్దాన్‌ రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఇంచుమించు ఒకే రకంగా మన రాష్ట్రంలా వున్నప్పటికీ వీటి సాగు మాత్రం మన వద్ద తక్కువగా వుందని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఉద్యానవనశాఖ సంచాలకులు మార్చి ,2019లో జాతీయ విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం (ఎన్‌ఆర్‌సిఎస్‌ఎస్‌) అజ్మీర్‌ను సందర్శించారు. తెలలంగాణ రాష్ట్రంలో ఈ పంటల సాగుకు గల అవకాశం గురించి అక్కడి శాస్త్రవేత్తలతో చర్చించారు. 

ఈ పంటల ఆవశ్యకత, లోటును పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతోంది.  పంట కాలనీల ద్వారా విత్తన సుగంధ ద్రవ్యాల విస్తీర్ణం పెంచాలంటే 1.15 లక్షల ఎకరాలు అవసరమని గుర్తించారు. అంతే కాకుండా ధనియాలు, జీలకర్ర, మెంతులు సోంపు వాము సాగును ప్రోత్సహించడానికి సమీకృత అభివృద్ది పథకం (ఎంఐడిహెచ్‌) 2019- 20 సంవత్సరానికి 100 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలను పైలెట్‌ ప్రాజెక్టుగా రైతుల పొలాల్లో చేపట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అవసరమైన విత్తనాలను కూడా అజ్మీర్‌లోని జాతీయ విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం నుంచి తెప్పిస్తున్నారు.

కాగా, ఈ విషయమై తెలంగాణ ఉద్యానవనశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ..  విత్తన సుగంధ ద్రవ్యాల పంట సాగుపై తెలంగాణ రైతాంగానికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ పంటలు పండించడానికి గల ఆవశ్యకత, అవకాశాలపై అజ్మీర్‌లోని జాతీయ విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం సహకారంతో మంగళవారం రాష్ట్రస్థాయి రైతు అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈసదస్సు ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ రైతులు సుగంధ ద్రవ్యాల సాగు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. దాదాపు 200 మంది ఔత్సాహికులు, అభ్యుదయ రైతులు పాల్గొంటారని అన్నారు. వారంతా నిర్మల్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి , నల్గొండ జిల్లాల నుంచి సుగంధ ద్రవ్య సాగు ప్రదర్శన క్షేత్రాలకు ఎంపిక చేయబడినవారని అధికారులు తెలిపారు.