తోపుడు బండికి తోడుగా వుందాం - పుస్తకాన్ని బతికించుకుందాం ! - MicTv.in - Telugu News
mictv telugu

తోపుడు బండికి తోడుగా వుందాం – పుస్తకాన్ని బతికించుకుందాం !

July 29, 2017

పుస్తకం వెలకట్టలేని గొప్ప బహుమతి

పుస్తకం నిన్ను తీర్చిదిద్ది నడిపించే దిక్సూచి

పుస్తకం అపార జ్ఞాన సంపదను నీకు వారసత్వంగా ఇస్తుంది

పుస్తకం ఒక చైతన్య వారధి

సమ సమాజనోద్ధరణ దీప్తి

అజ్ఞానాంధకారాన్ని పారద్రోలే అఖండ జ్యోతి

ఆ జ్యోతిని వెలిగిస్తున్నది తోపుడు బండి

పుస్తకం పావనం, పవిత్రం..,

అందుకు సోపానంగా నిలిచింది తోపుడు బండి

మనిషి తనాన్ని మేల్కొలిపి,

మానవత్వాన్ని నీ అంతరానికి అద్ది

జీవితాలను ఆదర్శప్రాయం చేసే ఏకైక జిగ్రీ దోస్త్ పుస్తకం

ఆ పుస్తకానికి నేస్తం తోపుడు బండి

దానికి అంతర్నేత్రం షేఖ్ సాదిక్ అలీ

పుస్తకం ఆత్మీయం, అపారం, ఆదర్శం..,

పుస్తకంతో చెలిమి చేసినోడు చెడిపోడురా..

గెలిచి నిలుస్తాడని తెలుసుకో !

పుస్తకమా ఇంటర్నెట్టులో బంధీ అయ్యావా ?

ఇంటర్నెట్ కల్చర్ వచ్చాక బుక్ కల్చర్ కనుమరుగైపోతోందనేది చేదు నిజం ? ఇంటర్నెట్టు హవా ఈదురుగాలిలా వీస్తోంది. ఎవరి చేతుల్లో చూసినా ఆపిల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు తప్పితే పుస్తకం కనిపిస్తోందా ? నో.. కనిపించడం లేదు ! ప్రపంచాన్ని గుప్పిట పట్టుకున్నాక పుస్తకం అవసరం లేదనిపిస్తోంది అందరికీ. ‘ ఉ ’ అంటే గూగుల్ ‘ ఆ ’ అంటే గూగుల్. పుస్తకం అవసరం తీరింది అందరికీ. పుస్తకాలు కూడా గూగుల్ లో బంధీలైపోయాయి. అక్షరాలు డిజిటలైజ్ అయిపోయాయి. కలం పట్టుకొని రాసి, పుస్తకాలు పట్టుకొని అలా ఆ పుఠలను తాకి స్పర్శను ఆత్యీయంగా భావిస్తూ,వెలకట్టలేని జ్ఞానాన్ని సముపార్జించుకునే రోజులకు కాలం చెల్లిందా ? మనుషులను ఆవరించిన ఇంటర్నెట్టు తన కంటికి పుస్తకాన్ని ఇంపుగా కాకుండా దాన్ని చూసి జంపు అయిపోయేలా మనిషిని తయారు చేసిందా ?

ఎందకు ఒక సాంకేతిక విప్లవం పుస్తకాన్ని విగత జీవిగా మార్చాలి ? నో.. పుస్తకాన్ని బతికించాలి.. దానికి పున: ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి.. ఎవరు చెయ్యాలి ? అందరూ ఈ ఇంటర్నెట్టు మాయాజాలంలో ఆగమైపోయిన వారే ? పుస్తక ప్రియులుగా అంతమైపోయారు ?? విశ్వ వ్యాప్తంగా గాడాంధకారం అలుముకుంది ??? పుస్తకం ఒంటరిగా ఆ కారు చీకట్లో కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఆకాశానికి అర్రులు జాచి దైవాన్ని ప్రార్థిస్తున్నప్పుడు పైవాడు కరుణించాడేమో. ఒక్కడున్నాడనే భరోసానిచ్చాడు. అంతే పుస్తకానికి పోయిన ప్రాణం తిరిగొచ్చినంత పనైంది. వెలుతురు చినుకులు కురుస్తున్నట్టు, ఇంటర్నెట్టు బంధనాల నుండి తను విముక్తమౌతున్నట్టు, అందరి చేతుల్లోకి మళ్ళీ ఆత్మీయంగా అలంకృతమౌతాననే దృఢాత్మ విశ్వాసాన్ని తన ఊపిరిలో నింపుకున్న పుస్తకం రొమ్ము విరిచింది ఒక వీరుణ్ని చూసి. తొలుత చాలా మంది దీన్ని విమర్శించారు. అయినా సాదిక్ మొక్కవోని దీక్షతో ముందడుగు వేసాడు. ఇవాళ ఎందరికో పుస్తకాల విలువను తెలియజేస్తున్న ధన్యజీవి సాదిక్.

ఆ వీరుడే షేఖ్ సాదిక్ అలీ. అతనే అంతమౌతున్న తన ఉనికిని కాపాడే ఆత్మీయుడు అనుకుంది. తన ఉనికిని ప్రశ్నించుకున్న పుస్తకం ఇప్పుడు ధైర్యంగా అంతర్ఝాలానికి సవాల్ విసురుతూ నిలబడింది. అలా షేఖ్ సాదిక్ అలీ ఆలోచనల్లోంచి పున:ప్రాణ ప్రతిష్ఠ చేస్కున్న ‘ తోపుడు బండి ’ మీద పుస్తకం ఠీవీగా వస్తోంది గ్రామ గ్రామానికి, మనిషి మనిషి దగ్గరికి. మనిషి అంతరాల్లో నిక్షిప్తమైన తన మీది ప్రియత్వాన్ని తడుముదామని తోపుడు బండెక్కి వస్తోంది పుస్తకం.. ఆహ్వానిద్దాం.. ఆత్మీయంగా పుస్తకాన్ని గుండెలకు హత్తుకుందాం.. తరతరాలకు, యుగయుగాలకు అందరం కలిసి పుస్తకాన్ని చిరంజీవిగా నిలుపుకుందాం. మనోవేల్పును చేస్కుందాం…

తోపుడు బండి

ఈ తోపుడు బండి అనబడే బృహత్తరమైన కార్యం 22 ఫిబ్రవరి 2015 లో ప్రారంభమైంది. దీని వెనకాల పెట్టని కోట వలె నిలుచున్న వ్యక్తి షేఖ్ సాదిక్ అలీ. ఈ ఆలోచన రావడానికి వెనకాల ఒక చిన్న సంఘటనను వివిరించారు సాదిక్. 2014 లో హైదరాబాదులో బుక్ ఫెయిర్ పెట్టారట. చాలా మంది జనాలు వచ్చారు. పుస్తకాలు కొనుక్కున్నారు. అక్కడే ఏదో వెలితిగా తోచిన ఆలోచన సాదిక్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది. దాని గురించిన మథనం మనసులో రగులుతూనే వుంది. థాట్ ప్రాసెసింగ్ లో పుస్తకం ఒంటరి వేదన చేస్తున్నట్టు తనకు సంకేతాలు అందుతున్నాయి. పుస్తకం వ్యధ తనను వెంటాడుతన్నట్టు అనిపించింది. ఒకసారి సూర్యాపేట నేషనల్ దాబాలో లంచ్ కోసం ఆగారంట. అప్పుడు లంచ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. బుక్ ఫెయిర్ లో కొన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళకేదైనా బుక్ అవసరమనిపిస్తే కోటీకో, అబిడ్స్ కో వెళ్తారు. లేదంటే మానేస్తారు, ఇంకా లేదంటే ఇంటర్నెట్టును ఆశ్రయిస్తారు కదా.. లేకపోతే మళ్ళీ బుక్ ఫెయిర్ వచ్చిందాక ఎదురు చూడాలి ? ప్చ్ తప్పదు ??

పుస్తకం కోసం ఎవరూ ఎదురు చూడకుండా వుండాలంటే ఏం చెయ్యాలి ? పుస్తకాన్ని వాళ్ళ దగ్గరికే తీస్కెళ్ళాలంటే ఎలాంటి పథకాన్ని అమలు చెయ్యాలి ? కూరగాయలు అమ్మినట్టు తోపుడు బండి మీద పుస్తకాలను జనాల దగ్గరికే తీస్కెళ్తే ఎలా వుంటుంది ? అనే ఆలోచన స్పార్క్ లా వచ్చింది. అంతే ఇక ఆ ఆలోచనకు కార్యరూపాన్ని తీస్కొచ్చారు. అలా 22 ఫిబ్రవరి 2015 న తోపుడు బండి స్టార్ట్ అయింది. మూణ్ణెల్లలో 360 కిలో మీటర్లు ప్రయాణించింది తోపుడు బండి. ఇదొక గ్రాండ్ రికార్డ్. ఇలాంటివెన్నో రికార్డులను ముందు ముందు చవిచూడనుంది తోపుడు బండి. చాలా మందిని పుస్తకాల వైపు ఆకర్షితులను చేయగలిగారు. కొందరు ఎఫ్ బి మిత్రులు తోపుడు బండికి సహకారం అందించారు.

100 రోజులు 1000 కిలోమీటర్లు

తోపుడు బండి సిటీ, నగరాలకే పరిమితమైతే ఎలా ? అనుకొని దీన్ని పల్లెలకు విస్తురించాలనే భావంతో 24 జనవరి 2016 మొదలు పెట్టి 8 మే 2016 న హన్మకొండలో ముగించారు. మొత్తం 5 జిల్లాల పల్లెటూళ్ళలో తోపుడు బండిని తీసుకెళ్ళారు. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండల్లో తోపుడు బండి తచ్చాడింది. అయితే ఈ వంద రోజుల్లో ఎక్కడా హైవే ఎక్కలేకపోవడం విశేషం. ఈ ప్రయాణంలో సాదిక్ చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చుకున్నారు. ఎక్కడ తిన్నారో ఎక్కడ పడుకున్నారో పుస్తకమే సాక్షి, తోపుడు బండే వకాల్తా.

అయితే ఈ ప్రయాణంలో వారికి కొన్ని వాస్తవాలు కళ్ళకు కట్టాయి. కవిత్వ పుస్తకాలు కొని ఎవరూ చదవటం లేదు. ఏం చెయ్యాలి ? వారికి ఉచితంగా పుస్తకాలు ఇస్తే ఎలా వుంటుంది ? బ్రహ్మాండంగా వుంటుందనుకొని.. వుచితంగా పుస్తకాలను పంచడం స్టార్ట్ చేసారు. స్కూళ్ళల్లో పిల్లలకు కూడా ఉచితంగా పంపిణీ చెయ్యటం మొదలు పెట్టారు.

ఊరూరా గ్రంథాలయం

వూళ్లల్లో తోపుడు బండి సంచరిస్తున్నప్పుడు కొంత మంది యూత్ వచ్చి ఒక మాట చెప్పారు. ‘‘ సార్.. మా వూళ్ళో లైబ్రరీ ఒకప్పుడుండేది. మాకు మళ్ళీ లైబ్రరీ కావాలి ’’ అనగానే దాన్ని కార్యరూపంలోకి తీసుకురావటానికి తోపుడుబండి ముందుకొచ్చింది. ‘ ఊరూరా గ్రంథాలయం ’ అనే నినాదంతో 112 లైబ్రరీలను ఎస్టాబ్లిష్ చేసారు. చిన్నగా స్కూళ్ళల్లో కూడా గ్రంథాలయాలను తోపుడు బండి స్టార్ట్ చేసింది. కొంత గ్యాప్ తర్వాత పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో ఎండల్లో ఆడతారు. కాబట్టి వాళ్ళకు ఆటతో పాటు పుస్తకంతో కూడా దోస్తానా చేస్తే ఎలా వుంటుంది ? అంతే ఇంకొక నినాదాన్ని పూనింది తోపుడు బండి. ఆ నినాదమే ‘ బస్తీలో పుస్తకాల పండగ ’

బస్తీలో పుస్తకాల పండగ

ఆడుకునే పిల్లలకు ఈ వయసు నుండే పుస్తకానికి చేరువ చెయ్యాలని పిల్లలకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చెయ్యటం మొదలు పెట్టారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. తన సొంత డబ్బులతో పుస్తకాలు కొని వాటిని పిల్లలకు ఉచితంగా పంచడం అనేది చాలా కష్టమైన పని. కానీ సాదిక్ ఎంతో ఔదార్యంతో ముందడుగు వేసారు.

బడి బడికి తోపుడు బండి – ఊరూరా గ్రంథాలయం

ఊళ్ళల్లో బడి బడిని తోపుడు బండి పలకరించడం ఇంకొక మహా యజ్ఞం. పిల్లలకు పుస్తకాల గొప్పతనం గురించి వివరించి వాళ్ళను పుస్తకాలను జిగ్రీ దోస్తులను చెయ్యటమే ప్రధానమైన లక్ష్యంగా ఇంకొక ముందడుగేసారు. అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలుపుకొని 500 లైబ్రరీలను పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 14 రోజుల్లో 20 గ్రంథాలయాల ఏర్పాటు జరిగింది. ఇంకా జరుగుతూనే వుంది ఈ మహా పుస్తక యాగం ! ఇదొక ఆరని తడి !!

షేఖ్ సాదిక్ అలీ

సాదిక్ వాళ్ళ నాన్నది వరంగల్ జిల్లా వర్ధన్న పేట, అమ్మది ఖమ్మం జిల్లా కల్లూరు. రెండు జిల్లాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సాదిక్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎమ్ఏ లిటరేచర్ తెలుగు చదువుకున్నారు. 1986 నుండి 1995 వరకు ‘ ఉదయం ’ దిన పత్రికలో సబ్ ఎడిటర్ గా తన పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా ఉదయంలోనే సెంట్రల్ డెస్క్ ఇన్ ఛార్జ్ గా, చీఫ్ న్యూస్ కో ఆర్డినేటర్ గా, సీనియర్ రిపోర్టరుగా వివిధ హోదాల్లో పని చేసారు. శివరంజనిలో కూడా పని చేసారు. అలాగే సినిమాలకు కూడా వర్క్ చేసారు. స్టోరీ డిస్కషన్స్, మాటలు, పబ్లిసిటీ డిజైనింగ్, ప్రొడక్షన్ ఇలా వివిధ విభాగాల్లోనూ తన సత్తా చాటుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం చాలా కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. స్థిరాస్తి వ్యాపారం, మ్యాట్రిమోని వెబ్ సైట్లలో సైతం పని చేసారు.

తన జీవిత భాగస్వామి ఉషా దయాల్. ఇద్దరూ చిన్నప్పటి నుండీ క్లాస్ మేట్స్. వీరిది ప్రేమ వివాహం. ఉషా దయాల్ ఎమ్ఎస్ సి అగ్రికల్చర్ చదివారు. ప్రస్తుతం జాయింట్ డైరెక్టరుగా ఉద్యోగం చేస్తున్నారు.

ఇదీ.. తోపుడు బండి కథ. దాని వెనుకున్న సారథి షేఖ్ సాదిక్ అలీ కథనం. ముందు ముందు కూడా తోపుడు బండి తను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడం ఖాయం అంటున్నారు చాలా మంది. ఈ తోపుడు బండికి ప్రతదినం ప్రారంభమే.. శుభం కార్డు లేదు. మునుపటిలా అందరూ పుస్తకాన్ని హస్త భూషణం చేస్కున్నదాకా తన ప్రయాణం ఆగదని గట్టిగా వాగ్దానం చేస్తోంది. ఇప్పటికే చాలా మందిని పుస్తక ప్రియులను చేసిన ఘనత తోపుడు బండిది. తోపుడు బండి యొక్క అర్థాన్ని తెలుసుకొని దాని పరమార్థం కోసం మనం ఒక అడుగేసినా చాలు మళ్ళీ మునుపటి పుస్తకాలను పట్టుకున్న జమానా తిరిగి వస్తుంది. పుస్తకం దర్జాగా తోపుడు బండి మీద వూరేగుతూ వస్తోంది రండి అలుముకుందాం.. అనురాగంగా పుస్తకాన్ని అరచేతుల్లోకి తీస్కుందాం..!

– సంఘీర్