నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం.. పెను విషాదం నింపింది. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం సమయంలో ఆ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఇద్దరు పసికందులు సహా 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఇద్దరు ఐర్లాండ్‌కు చెందినవారు, ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పొఖారో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 30 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం కాలిపోయింది. ఇప్పటికీ ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కరినీ కూడా కాపాడలేకపోయినట్లు అధికారులు తెలిపారు.