భారత దేశం అప్పుల కుప్పలా మారుతోంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం అప్పులు జెట్ స్పీడ్‌తో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు మన దేశం అప్పులు రూ. 147.19 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకుమునుపు అంటే జూన్ నెలాఖరున కేంద్రం అప్పులు రూ. 145.72 లక్షల కోట్లని వెల్లడించింది. గత రెండు నెలల (జులై, ఆగష్టు)వ్యవధిలోనే బీజేపీ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్ల అప్పు చేసింది. దీంతో సెప్టెంబర్ చివరి నాటికి అది రూ.147.19 లక్షల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం అప్పులో 89.1 శాతం పబ్లిక్ డెట్ అంటే మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలని కేంద్రం వెల్లడించింది. చెల్లించాల్సిన మొత్తం అప్పుల్లో 29.6 శాతం అప్పులు… వచ్చే అయిదేళ్ళలోపే చెల్లించాల్సి ఉంది.
రూ. 92,371 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అప్పుల సేకరణతో పాటు ఆ అప్పులపై చెల్లించే వడ్డీ రేటూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రుణ పత్రాలపై సగటు వడ్డీ రేటు 7.23 శాతం ఉంటే సెప్టెంబరు నాటికి అది 7.33 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక రెపో రేటు పెంచుకుంటూ పోవడం ఇందుకు ప్రధాన కారణం.