మాస్ ప్రేక్షకుల్లో రవితేజకు తిరుగులేని అభిమానం ఉంది. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లే ఆయన్ని తెలుగు చిత్రసీమలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా నిలబెట్టాయి. ఈ తరహా కథాంశాలతో ఇప్పటికే పలు సినిమాలు చేయడం, ఆయనలోని హీరోయిజాన్ని ఆవిష్కరించే శక్తివంతమైన కథలు దొరక్కపోవడంతో దాదాపు రెండేళ్ల పాటు మాస్ సినిమాలకు దూరమయ్యారు రవితేజ. కొంత విరామం తర్వాత ఆయనలోని మాస్ కోణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కిన తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’. రేసుగుర్రం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలతో రచయితగా ప్రతిభను చాటిన విక్రమ్ సిరికొండ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ప్రచార చిత్రాల్లో రవితేజ స్టైలిష్‌గా కనిపించడం, ఆయనలోని హీరోయిజాన్ని పతాక స్థాయిలో చూపించడంతొ సినిమా పట్ల అందరిలో ఆసక్తి మొదలైంది. నూతన దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో రవితేజ ఈ సినిమాను అంగీకరించడంతో ఇందులో ఏదో ఒక వైవిధ్యం తప్పకుండా ఉంటుందని ఊహించారు
కార్తికేయ(రవితేజ) నిజాయితీపరుడైన యువకుడు. కుటుంబమంటే ప్రాణం. పాండిచ్చేరిలో ఓ ప్రైవేటు సంస్థను నిర్వహిస్తుంటాడు. అతనికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తుంటారు. పుష్ప అనే అమ్మాయితో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. తొలుత కార్తికేయను పుష్క తిరస్కరించినా తర్వాత అతడి మంచి తనం చూసి ప్రేమిస్తుంది. పాండిచ్చేరిలో ఓ విద్యార్థి నాయకుడు హత్యకు గురవుతాడు. ఆ హత్యను కార్తికేయ చెల్లెలు చూస్తుంది. ఆ హంతకుడి అనవాలు పోలీసులకు చెబుతుంది. వారి అన్వేషణలో ఆ హంతకుడు ఇర్ఫాన్ లాలా అని, ఐదేళ్ల కిందటే చనిపోయాడని తెలుస్తుంది. కార్తికేయ చెల్లెలు చెప్పింది అబద్దమని పోలీసులు తేలుస్తారు. ఇంతలో కార్తికేయకు ఎదురుపడిన ఇర్ఫాన్లాలా అతడిని చూసి పారిపోతాడు. అతడిని పట్టుకోవడానికి కార్తికేయ ఎందుకు ప్రయత్నించాడు? దరాబాద్‌లో పోలీసుగా పనిచేస్తున్న కార్తికేయ కుటుంబంతో దూరంగా పాండిచ్చేరిలో ఎందుకు బతుకుతున్నాడు? దివ్య(సీరత్‌కపూర్) అనే అమ్మాయితో కార్తికేయకు ఉన్న సంబంధమేమిటి? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ఉద్యోగబాధ్యతల్ని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఓ పోలీస్‌కు ఎదురైన సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వృత్తి బాధ్యతల్లో పడి కుటుంబాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశాడు? తన తప్పును ఎలా సరిదిద్దుకున్నాడనే అంశాన్నిఆవిష్కరిస్తూ దర్శకుడు విక్రమ్ సిరికొండ ఈ సినిమాను చూపించారు. ఉద్యోగ బాధ్యతల్లో పడి కుటుంబాలకు దూరమై సంఘర్షణకు లోనయ్యే పోలీసుల, వారి ప్రేమాభిమానాల కోసం తపించే కుటుంబ సభ్యుల ఆవేదనను హృద్యంగా చూపించారు. పోలీసు వృత్తిలో ఉండే సవాళ్లను విభిన్నంగా తెరకెక్కించారు. ప్రథమార్ధం మొత్తం కుటుంబ కోసం రవితేజ పడే ఆరాటం, రాశీ ఖన్నాతో ప్రేమాయణం లాంటి అంశాలతో సరదాగా సాగుతుంది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో సినిమాను రొటీన్ బాటను పట్టించారు దర్శకుడు. ఆ సన్నివేశాలన్నీ రవితేజ నటించిన ‘పవర్’, ‘విక్రమార్కుడు’తో పాటు ‘శివమణి’ లాంటి పలు సినిమాల్ని గుర్తుకుతెస్తాయి.
తన ఉద్యోగ బాధ్యతలకు అడ్డంకులను సృష్టించే అవినీతిపరులైన కొందరు రాజకీయనాయకుల్ని, వారి చేసే అక్రమాలను హీరో ధైర్యంగా ఎదుర్కోవడమనే అంశాల చుట్టూ నడిపించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను ఊహజనీతంగా తీర్చదిద్దారు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత ఎక్కడ ప్రేక్షకుడిలో కలగదు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన రౌడీలను ఎదుర్కోవడానికి తన తెలివితేటలతో హీరో వేసేఎత్తు ఒక్కటే కాసింత ఆకట్టుకుంటుంది. అలాంటి సన్నివేశాలు కథనంలో మరిన్ని రాసుకుంటే బాగుండేది. ద్వితీయార్ధం నత్తనడకన సాగడం సినిమాకు మైనస్‌గా మారింది. జీవా, రవితేజ ఎపిసోడ్ చూస్తుంటే నిడివి పెంచడానికి దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పతాక ఘట్టాలు హడావిడిగా ఏదో ముగించాలనే తొందరలో పూర్తిచేసినట్లు అనిపిస్తుంది.
హీరోకు దీటుగా బలమైన ప్రతినాయకుడు లేడు. దాంతో హీరో, విలన్ పోటాపోటీగా ఎత్తులు వేసుకోవాల్సిన సన్నివేశాలన్ని నిరాసక్తతగా సాగుతాయి. రవితేజ శైలికి తగిన పోరాట ఘట్టాలు, వినోదం ఈ సినిమాలో లోపించాయి.
కొత్తదనం అనే అంశాలను పక్కనపెట్టి పూర్తిగా సేఫ్‌గేమ్ ఆడారు దర్శకనిర్మాతలు. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు.
పోలీస్ పాత్రలో నటించడం రవితేజకు కొత్తేమీకాదు. పోలీసు కథలతో ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి. మరోసారి ఖాకీడ్రెస్‌లో ఆకట్టుకున్నాడు. తనదైన శైలి హీరోయిజం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. కుటుంబం, వృత్తికి మధ్య నలిగిపోయే పోలీస్ అధికారి పాత్రలో ఇమిడిపోయాడు. సినిమా పూర్తి భారాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు. రాశీఖన్నా, సీరత్‌కపూర్ రూపంలో సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నా కథలో వారి పాత్రలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. గ్లామర్ విషయంలో పోటీపడ్డారు. రాశీఖన్నాపై దుబాయ్‌లో తెరకెక్కించిన పాట మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. వినోదాల్ని పండించే బాధ్యతను రవితేజనే తీసుకున్నారు. వెన్నెలకిషోర్, మురళీశర్మ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కొన్ని నవ్విస్తాయి. విలన్ పాత్రల్లో నటించిన పాత్రధారల నటన ఆర్భాటం ఎక్కువ నటన తక్కువ అన్నట్లుగా ఉంటుంది. యాక్షన్ సినిమా అయినా కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు ఆ భావన కలగకుండా చేశారు. పాండిచ్చేరి ఎపిసోడ్, పాటలను కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. జామ్ 8 బృందం సమకూర్చిన బాణీలు అనువాద సినిమాల్ని తలపించాయి. ఒక్క పాట వినసొంపుగా లేదు. వక్కంతం వంశీ అందించిన కథలో ఎలాంటి కొత్తదనమూ లేదు. పోలీసు కథలతో తెలుగులో వచ్చిన సినిమాల ఛాయాలు ఇందులో కనిపించాయి. ఇందులో రవితేజకు ఏం నచ్చిందో అంతుపట్టదు.
రవితేజ అభిమానుల్ని సంతృప్తిపరిచే చిత్రమిది. మాస్ ప్రేక్షకుల అభిరుచులను తగ్గట్లుగా కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందించారు. కొత్తదనం కోరుకునే వారిని ఈ సినిమా నిరాశపరుస్తుంది. రవితేజ కెరీర్లో మరో రొటీన్ సినిమా చిత్రమిది.
రేటింగ్ 2.5/5