Tough competition in Group-II recruitment; 5,51,943 apply for 783 posts
mictv telugu

Group-2:783 పోస్టులకు 5 లక్షలపైనే దరఖాస్తులు

February 17, 2023

Tough competition in Group-II recruitment; 5,51,943 apply for 783 posts

ప్రభుత్వ విభాగాల్లోని వివిధ 783 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 29న ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించగా.. జనవరి 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. గురువారం (ఈనెల 16న) సాయంత్రం 5 గంటలతో ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ శుక్రవారం తెలిపింది. ఈ పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పేర్కొన్నారు.

783 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు అప్లై చేశారంటే పోటీ ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకున్నట్లైంది. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు.

నాయబ్‌ తహసీల్దార్‌, ఏసీటీవో, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖల్లో ఎస్‌ఐ, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, మండల పంచాయతీ ఆఫీసర్‌ తదితర ఉద్యోగాలు గ్రూప్‌-2 ద్వారా భర్తీ చేస్తారు. గత నోటిఫికేషన్‌ ద్వారా సుమారు 1000 పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం. అదేవిధంగా గత నోటిఫికేషన్‌లో ఇంటర్వ్యూ ఉండగా ప్రస్తుతం ఉండదు. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.