కొరకరాని కొయ్యలు- కోమటి రెడ్డి బ్రదర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

కొరకరాని కొయ్యలు- కోమటి రెడ్డి బ్రదర్స్

September 12, 2017

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే.  ఒకరి తోకలు ఇంకొకరు గుంజడం, ఆ  పార్టీలో జరిగినంతగా ఇంకే పార్టీలోనూ జరగదు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పదవుల పంపిణీపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికి రాడని, ఆ పార్టీ నాయకులు కోమటి రెడ్డి బ్రదర్స్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో  ఉత్తమ రెడ్డి పాత్ర లేదని, ఆయన మూలంగానే తెలంగాణ మూడేళ్లు ఆలస్యంగా వచ్చిందని వారు అంటున్నారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ ఫిట్ అని సర్టిఫికెట్ కూడా జారీ చేశారు కోమటి రెడ్డి బ్రదర్స్. ఇప్పటికిప్పుడు ఉత్తమ్ ని దించితే తప్ప, కాంగ్రెస్ పార్టీ బాగుపడదని అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఇదిలా ఉంటే  కాంగ్రెస్ అధిష్టానం మాత్రం 2019 ఎన్నికల వరకు రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పులూ చేర్పులూ ఉండవని కుంతియా నోట పలికించింది. కోమటి రెడ్డి బ్రదర్స్ కోపానికి, చేస్తున్న విమర్శలకు కుంతియా మాటలే కారణమని అర్థమవుతోంది.  అధిష్టానం తమను పట్టించుకోవడంలేదనే విషయాన్ని గ్రహించిన కోమటి రెడ్డి బ్రదర్స్, తమ అమ్ముల పొదిలోని అస్త్రాలను బయటకు తీసినట్టున్నారు.  పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారాన్ని వారు ప్రారంభించారు. ఇప్పుడు కోమటి రెడ్డి బ్రదర్స్ ఇస్తున్న లీకులు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారాయి.

బీజేపీలోకి వెళ్తారా?

తెలంగాణ లో కాషాయ దళం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో  ఆ పార్టీ  రెండో స్ధానం లేదా మూడో స్ధానం సంపాదించుకోవడానికి ప్రణాళికను రూపొందించుకుంటోంది. ఈ విషయం కనీస రాజకీయ పరిజ్ఞానం  ఉన్న ఎవరికైనా అర్థమౌతుంది. అయితే  ముఖ్యమంత్రి పదవి మీద మోజు పెంచుకున్న  రెడ్డి బ్రదర్స్, వాళ్ల లక్ష్యాన్ని ఎట్లా సాధిస్తారనేది తెలియాల్సి ఉంది. వారు బీజేపీలో చేరడం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తాడో పేడో తేల్చుకోవాలని సూచిస్తున్నారు.  లేదా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటే వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.