ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పొత్తులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, అనంతరం పవన్ కల్యాణ్ స్పందించిన తీరు వెరసి పొత్తుల గురించి అందరూ చర్చించుకునేలా చేశాయి. ఈ క్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై సెటైర్లు వేశారు. ‘ప్రజల్లో సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక చంద్బాబు, పవన్, లోకేష్‌లు గ్రామాల్లో విషం చిమ్ముతున్నారు. ఎవ్వరూ నమ్మరని తెలిసినా సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారు.
ఓటమి భయం పట్టుకుంది కాబట్టే చంద్రబాబు పొత్తు గురించి కాళ్లబేరానికి దిగుతున్నారు. ఎమ్మెల్యేగా ఒక్క చోట కూడా గెలవలేని పవన్.. జగన్‌ను ఓడిస్తాననడం హాస్యాస్పదం. ఆయేమైనా దేవుడా? లేక జ్యోతిష్కుడా? చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళ్తే, జగన్ కరోనా వచ్చినా ధైర్యంగా నిలబడ్డాడు. తప్పించుకొని పారిపోలేదు. ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. మళ్లీ ఎన్నికలు వస్తుండడంతో వానపాములు లేచి బుసలు కొడుతున్నాయ’ని విమర్శించారు.