టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై ‘రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్’ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్న నేపథ్యంలో ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ధర్నా చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని ఇంటి బయటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి బయటకు వస్తే అరెస్ట్ చేస్తానంటే ఎలా? అని రేవంత్ ప్రశ్నించారు. మీకు అభ్యంతరం ఉంటే ధర్నాచౌక్ దగ్గర అరెస్ట్ చేయండి అని పోలీసులకు సూచించారు. ఇంటి నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, తన ఇంటికొచ్చిన విజయారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని పోలీసులను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విజయారెడ్డిని వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో ఇంటి వద్ద ఘర్ణణ వాతావరణం నెలకొంది. ప్రగతిభవన్ ముందు ధర్నాకు దిగేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలు, శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
ఈ వార్త చదివితే.. ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయరు..
మొట్టమొదటి ఫ్రాగిల్ ఎక్స్ సిండ్రోమ్ క్లినిక్ !
నుమాయిష్ ఎగ్జిబిషన్.. అర్ధరాత్రి 12 గంటల వరకూ మెట్రో సేవలు