టీఆర్ఎస్ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసైల మధ్య ఇటీవల జరిగిన పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ భాగోతం అంతా గవర్నర్ కేంద్ర పెద్దలకు వివరించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ సమస్యలు, ఆసుపత్రుల్లో ఎలుకలు, డ్రగ్స్ వ్యవహారం, ప్రోటోకాల్, విద్య, వైద్యం వంటి విషయాలు, ప్రభుత్వ వైఫల్యాల గురించి సవివరంగా రిపోర్టు ఇచ్చారని అంచనా వేశారు. కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటే గవర్నర్‌తో సఖ్యత చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నరుకు విశేష అధికారాలున్నాయని గుర్తు చేశారు. విద్య, వైద్యం, డ్రగ్స్, ప్రోటోకాల్ వంటి అంశాల్లో గవర్నర్ అధికారులను పిలిచి సమీక్ష చేసే అధికారం కలిగి ఉన్నారన్నారు. చట్టం ప్రకారం వ్యవహరించని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నరును కోరారు. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పి పుచ్చేందుకు కేసీఆర్ గవర్నరుపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. కాగా, నిన్న గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వం తనను అవమానానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.