చైనా మన దేశ సరిహద్దులను ఆక్రమిస్తున్నా.. ప్రధాని మోదీ స్పందించడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓ వైపు దురాక్రమణకు గురవుతున్నా.. అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం చైనాకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ అవగాహన సదస్సులో మాట్లాడిన రేవంత్.. మోదీ ప్రభుత్వం తీరుతో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంలో ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి కేంద్రం ప్రభుత్వాలను మారుస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికే రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని.. 2014లో ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా పదవి స్వీకరించలేదన్నారు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆదుకుందన్నారు. జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదు. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులపై ఉందని, ప్రతీ గడపకు తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించిందన్నారు.
2003 లో ఎలాంటి విపత్కర పరిస్థులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు రేవంత్. ధరణి తో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఓటరు లిస్టులో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై , కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేసి, వాటిని ప్రజల్లోకి తీసుకెళదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదని, కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఇవి కూడా చదవండి :
చంద్రబాబు కుప్పం టూర్‌పై హై టెన్షన్..
మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. టోల్గేట్ వద్ద వీరంగం..
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు