టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ధర్నా జరగనుంది. దీంతో ముందస్తుగా పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. పోలీసు వాహనాలు, వ్యాన్లను సిద్ధం చేసుకొని భారీగా పోలీసులతో ఇంటి చుట్టూ పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుల ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. వారిని గృహ నిర్బంధం చేశారు. అంతేకాదు.. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే ఈ ధర్నా నిర్వహించుకునేందుకు టీపీసీసీ పెట్టుకున్న దరఖాస్తుకు ఆదివారం సాయంత్రం అనుమతి లభించలేదు. టీపీసీసీ దరఖాస్తు అనుమతిని పోలీసులు నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ధర్నా నిర్వహిస్తామని టీపీసీసీ సీనిరయర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ ను ముందస్తు అరెస్ట్ చేశారు.