గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతికుమారి రాజ్ భవన్‌కు రాని విషయాన్ని గవర్నర్ ట్వీట్ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. శుక్రవారం నాడు కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు చాలా అధికారాలున్నాయని వాటి ప్రకారం, అందరూ అధికారులను ఆమె పిలిచి మాట్లాడవచ్చని తెలిపారు. సమీక్ష చేసి సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నారు. డీవోపీటీకి సిఫారసు చేస్తే చాలు.. సీఎస్ మీద అయినా చర్యలు తీసుకోవచ్చని వివరించారు. సెక్షన్ 8 గురించి తెలియకపోతే తమకు సమయం ఇస్తే ఈ విషయమై గవర్నర్ కు వివరించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.
గవర్నర్ మొన్ననే అసెంబ్లీలో ఎవరూ పొగడనంత ఎక్కువ పొగిడారని గుర్తుచేశారు. ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకొనే రోజున గవర్నర్, ప్రభుత్వం ఒక్కటౌతున్నారని చెప్పారు. మిగిలిన రోజుల్లో డ్రామా రక్తి కట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అవగాహనతోనే రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌కు రాలేదు. కనీసం ఫోన్‌కాల్ చేసి మాట్లాడలేదు. ఆ మాత్రం తీరిక దొరకలేదా’ అంటూ గవర్నర్ హోదాలో తమిళి సై చేసిన ట్వీట్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాల్సిందిపోయి రాజకీయ నాయకురాలిలాగా విమర్శలు చేయటం ఏంటని నిలదీస్తున్నారు. ముందు 10 బిల్లులపై సంతకాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.