TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి, చేతగానితనానికి TSPSC ఉదంతం ఒక స్పష్టమైన ఉదాహరణ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, మోపాల్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..” TSPSC ప్రశ్నాపత్రాలు ఎలా లీక్ అయ్యాయో చైర్మన్ , సీఎం ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు.
ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. TSPSC రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. TSPSC ప్రశ్నాపత్రాలు దాచిన స్ట్రాంగ్ రూమ్‌లోకి ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా వెళ్లారు. ఇది సీఎం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనం.
TSPSC ఉనికి ప్రశ్నర్ధకంగా కనిపిస్తోంది. లీకేజీల వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం నిర్వహించిన అన్ని పరీక్షలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి” అని రేవంత్ పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ వచ్చాక ఏ పోటీ పరీక్ష కూడా పారదర్శకంగా నిర్వహించడం లేదన్న రేవంత్ ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలోనూ తప్పులు జరగడంతో 24 మంది విద్యార్థులు మరణించారని గుర్తు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీపై నివేదికలు తెప్పించుకుని గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.