హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటనలో వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్.. స్వాతి ముత్యంలో కమలాసన్ కంటే ఎక్కువ నటించారని టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘బచావో హైదరాబాద్’ పేరుతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన రేవంతిరెడ్డి..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలంటే సమర్థవంతులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. కేవలం నలుగురు ఐపీఎస్‌ల చేతుల్లోనే 15 శాఖలున్నాయని, నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని ఆరోపించారు. రిటైర్డ్ అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారు. కొంత మంది కేసీఆర్ తొత్తులకే పదవులు ఇస్తున్నారని . వీళ్లంతా సీఎంకు మంచి చేయడానికే పనిచేస్తున్నారని విమర్శించారు. సమర్ధ అధికారులను పక్కన పెట్టడం దారుణమన్నారు . నచ్చినోళ్లకు నజరానాలు.. నచ్చనోళ్లకు జరిమానాలు అని వ్యాఖ్యానించారు. మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు.