TPCC President Revanth Reddy visited Vemulawada Sri Rajarajeshwara Swamy Temple
mictv telugu

‘వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు’

March 5, 2023

ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.

పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని.. దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా? అంటూ రేవంత్‌ ప్రశ్నించారు. మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందన్నారు. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.