కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన మార్కండేయ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలపై బిఆర్ఎస్ నాయకులు అధికార బలంతో దౌర్జన్యం చేసి దాడులు చేశారన్నారు. కాంగ్రెస్ కార్యకర్త మెడపైన కాలు పెట్టి తొక్కుతున్న దృశ్యం రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు పరాకాష్టగా అభివర్ణించారు. ప్రాజెక్టును చూడడానికి వెళితే కూడా దౌర్జన్యం చేస్తారా.. అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా… నియంత పాలనా.. ? అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని మేము రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని, వెంటనే దోషులపై చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలు కాపాడాలని, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను నిలువునా ముంచి డబ్బుకు, పదవులకు అమ్ముడుపోయిన సుధీర్ రెడ్డి.. ప్రజా నాయకుడు రేవంత్ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మల్లు రవి. రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లో చేరి అధికార బీజేపీ, టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ లు ఒక్కటేనని అనేక సందర్భాలలో నిరూపణ అయ్యిందన్నారు. పెద్ద నోట్ల రద్దు నుంచి మొదలుకొని 370 ఆర్టికల్ రద్దు వరకు టిఆర్ఎస్ అన్ని సందర్భాలలో బీజేపీ కి బి టీమ్ గా పనిచేసిందన్నారు. మరోసారి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.