కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇదే విషయమై భేటీ కానున్నారు. అనంతరం సీఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఫిర్యాదు అంశం సంచలనంగా మారింది.
2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి.. తీరా గెలిచిన తర్వాత మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనససభపక్షాన్ని విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించారు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలకు రాజకీయమైన పదవులు దక్కాయి. అంతేకాదు ఆర్ధికంగా ఏ రకమైన లబ్ది జరిగిందనే విషయాలను కూడా సీబీఐకి అందించేందుకు సిద్ధమైంది. 2014-19 మధ్య కాలంలో కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
ఆ 12 మంది ఎమ్మెల్యేల్లో రేగా కాంతారావు, ఆత్రం సక్కు, సబితా ఇంద్రారెడ్డి , హరిప్రియానాయక్, దానం నాగేందర్, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, జాజుల సురేందర్ , గండ్ర వెంకటరమణారెడ్డి , దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి రంగారెడ్డి మరొకరు ఉన్నారు.