Traffic constable asked DCP for bribe in rajasthan
mictv telugu

డీసీపీ అని తెలియక లంచం అడిగిన కానిస్టేబుల్.. తర్వాత ఏమైందంటే

September 2, 2022

పౌరులు చేసే చిన్న తప్పిదాలు, నిబంధనల ఉల్లంఘనల కింద పోలీసులు చిన్న మొత్తంలో లంచం తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ప్రజలు కూడా వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే రాజస్థాన్‌లో ఓ సాధారణ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏకంగా డీసీపీనే లంచం అడిగాడు. తాను అడుగుతున్నది డీసీపీ అని కానిస్టేబుల్‌కి తెలియకపోవడం గమనార్హం. వివరాల్లోకెళితే.. రాజధాని అయిన జైపూర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నార్త్ విభాగానికి డీసీపీగా ఉన్న పరీష్ దేశ్ ముఖ్ బుధవారం రాత్రి నగరంలో నాకాబందీ నిర్వహించి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు గన్‌మెన్, డ్రైవరు కూడా సాధారణ దుస్తుల్లో ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ట్రాన్స్‌పోర్ట్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోటరీ సర్కిల్ వద్దకు రాగా, వాహనంపై కూడా ఎలాంటి పోలీసు గుర్తులు లేకపోవడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ డీసీపీ వాహనాన్ని ఆపాడు. సీటు బెల్టు పెట్టుకోలేదని చలాన్ రాసేందుకు సిద్ధమయ్యాడు. అంతలోనే రూ. 500 లంచం ఇస్తే చలాన్ రాయనని ఆఫర్ కూడా ఇచ్చాడు. దీంతో కోపగించుకున్న డీసీపీ పరీష్ ఉన్నతాధికారులకు సమాచారమివ్వగా, స్పందించిన అధికారులు కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో పరిశీలించేందుకు చేసిన డెకాయ్ ఆపరేషన్‌ ఇదని, ఇందులో కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ అడ్డంగా దొరికిపోయాడని డీసీపీ పర్వీష్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై నగర పౌరులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి అవినీతిని సహించలేమని, మంచి పని చేశారని డీసీపీని అభినందిస్తుండగా, జీతాలు చాలకపోవడంతో తక్కువ మొత్తంలో లంచం అడిగిన కానిస్టేబుల్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు మరికొందరు.