ట్రాఫిక్ పోలీస్ అంటే ఇలా ఉండాలి..  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ పోలీస్ అంటే ఇలా ఉండాలి.. 

October 26, 2020

Traffic Cop Felicitated For Sweeping Road In Cuttack

లైసెన్సు లేకండా రోడ్డు మీద వాహనాలను దర్జాగా తోలుతామంటారు. మధ్యలో ట్రాఫిక్ పోలీసు కనిపించాడంటే జంప్ అవాలని చూస్తారు. అబ్బా ఈ ట్రాఫిక్ పోలీసుల గొడవేంది అనుకుని చిరాకు కూడా ప్రదర్శిస్తుంటారు. అంతేగానీ మనవద్ద అన్నీ పత్రాలు సరిగ్గా ఉంటే ఆ ట్రాఫిక్ పోలీస్ ఏ చలానా విధించడు కదా అని ఒక్కమాట అనుకోరు. తప్పు చేసేది మనమై ఉండి పాపం ట్రాఫిక్ పోలీసోళ్లను ఉత్తి పుణ్యానికి నిందిస్తుంటాం. వారు తమ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారని భావిస్తే ఎవరికి వారు తాము సక్రమంగా అన్నీ పత్రాలు కలిగి ఉండాలని భావిస్తారు. ఆ సోయి లేకుండా అస్తమానూ ట్రాఫిక్ పోలీసులను నిందించేవారు ఎందరో. పాపం వాళ్లు విధి నిర్వహణలో ఎందరి చేతో పడరాని మాటలు పడుతుంటారు. అప్పుడప్పుడు ప్రమాదాల బారిన కూడా పడుతుంటారు. వాహనదారులను రక్షించడానికి రోడ్ల మీద నిత్యం వారు పడరాని పాట్లు పడుతుంటారు. పాపం వారి మీద ఈ మధ్య కొందరు దాడులు కూడా చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఒడిశాలోని ఈ ట్రాఫిక్ పోలీసుకు మీరు జై కొట్టాల్సిందే. ఎందుకంటే.. ఈయన కేవలం డ్యూటీ మాత్రమే కాకుండా ప్రజల మంచి కోసం కూడా పని చేస్తాడు. రోడ్లు ఊడ్చడం స్వీపర్ల పని అని భావించడు. హనదారులు ప్రమాదాల్లో చిక్కుకోకుండా కాపాడేందుకు.. ఆయన చీపురుపట్టి రోడ్లను కూడా ఊడ్చేస్తాడు. కటక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌‌కు చెందిన ఆయన పేరు మోహన్ రౌత్. ఆయన చేసిన మంచి పని ఎందరినో కదిలించింది. నెటిజన్ల లవ్ ఎమోజీలతో రాత్రికి రాత్రే హీరో అయిపోయారు. వర్షాల వల్ల రోడ్డు మీద గులకరాళ్లు, ఇసుక పేరుకుపోయి ఉన్నాయి. దాని మీద నుంచి వాహనాలు వెళ్తే జారి పడిపోతారు. అందుకని ఆయన చీపురు పట్టి వాటన్నింటినీ పక్కకు ఊడ్చి పారేశారు. ఆయన రోడ్లు ఊడ్చుతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఆయన చేసిన మంచి పని ఎందరినో కదిలిస్తోంది. ఎంతమంచి పని చేశారు పోలీసన్నా అని కామెంట్లు చేస్తున్నారు. మోహన్ రౌత్ చేసిన మంచిపనిని గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనను సత్కరించుకున్నారు.

 
కాగా, గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులు చేసిన ఎన్నో మంచి పనులు నెటిజన్లు ఆకర్షించాయి. అసోంలోని గువాహటిలో ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న మిథున్‌దాస్‌య అనే ట్రాఫిక్ పోలీసు, కుండపోత వర్షంలో కూడా నానిపోతూ డ్యూటీ చేశారు. అలాగే విజయవాడలోని హనుమాన్ జంక్షన్ సర్కిల్ వద్ద నిత్యం ట్రాఫిక్ రద్దీ బాగా ఉండే విషయం తెలిసిందే. అక్కడ నిత్యం దేవిశెట్టి శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ భారీ వర్షంలో తన విధులు నిర్వర్తించారు. కార్ఖానా జంక్షన్‌లోని మారేడుపల్లి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తనకు దొరికిన పర్సును దాని యజమానికి అందించి తన నిజాయితీని చాటుకున్నారు. ఇక ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసు అధికారి అంజపల్లి నాగమల్లు రోడ్డుపై నిలిచి ఉన్న వర్షపు నీటిని తట్ట తీసుకుని పారిశుద్ధ్య కార్మికుడిలా అవతలికి ఎత్తిపోశారు. ఇలా చెప్పుకుంటూపోతే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న మంచి పనులు ఎన్నో ఉంటాయి.