తెలంగాణలోని సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి వారి జాతర (పెద్దగట్టు జాతర)కు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జాతరకు లక్షలాది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి.1800 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వలంటీర్స్‌తో పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నారు. జాతరలో 60 సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల మళ్లింపు, పార్కింగ్ స్థలాలతో సిద్ధం చేసిన రూట్ మ్యాప్‌ను ఎస్పీ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెల 9వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నల్గొండ జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ రూట్లలో ప్రయాణించే వాళ్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
హైదరాబాద్-విజయవాడ ట్రాఫిక్ మళ్లింపు ఇలా
*హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల (మూసీ) బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బీబీ మీదుగా మళ్లిస్తారు.
* భారీ వాహనాలను, సరుకు రవాణా వాహనాలను మాత్రం టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా కోదాడ వెళ్లొచ్చు.
* విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను బీబీగూడెం, రోళ్లవాగుతండా మీదుగా టేకుమట్ల బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. భారీ, సరుకు రవాణా వాహనాలను కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారి 65పైకి చేరుకునేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ మార్గాల్లో వాహనదారులు ప్రయాణించాలని ఎస్పీ సూచించారు.