Traffic diversions between Rasoolpura and Ramgopalpet for three months
mictv telugu

హైదరాబాద్‌లో 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

November 23, 2022

హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట పరిధిలోని రసూల్‌పురా- రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగునున్నాయి. నవంబర్ 23 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్టు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డైవర్షన్ టైమ్​లో వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి.

*బేగంపేట ఫ్లైఓవర్ నుంచి కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టీ-జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేందుకు అనుమతి నిరాకరించారు. కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట వైపు రసూల్‌పుర నుంచి వెళ్లే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్‌ ఆసుపత్రుల వైపు వెళ్లొచ్చు.

*రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు అనుమతించరు. అటువైపుగా వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట ఠాణా, సింధికాలనీ, ఫుడ్‌వరల్డ్‌, హనుమాన్‌ టెంపుల్‌ మీదుగా వచ్చి ఎడమవైపు తీసుకుని రసూల్‌పుర వైపు వెళ్లే మార్గముంది.

*సికింద్రాబాద్‌ వైపు నుంచి కిమ్స్‌ ఆసుపత్రి వైపు వచ్చే వాహనాలు హనుమాన్‌ టెంపుల్‌ నుంచి లెఫ్ట్ తీసుకుని, ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా మీదుగా ఎడమకు మళ్లి కిమ్స్‌ ఆస్పత్రి వైపు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ఫ్లైఓవర్‌ నుంచి ఎడమకు తీసుకుని రాణిగంజ్‌ మీదుగా వచ్చి కుడి వైపుగా కిమ్స్‌కు చేరుకోవచ్చు.

*అంబులెన్స్‌లు లేదా రోగులను బేగంపేట ఫ్లైఓవర్‌ వైపు నుంచి కిమ్స్‌కు తీసుకువెళ్లాలంటే సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకుని రాంగోపాల్‌పేట ఠాణా నుంచి కిమ్స్‌ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇక భారీ వాహనాలు మినిస్టర్‌ రోడ్‌ వైపు వెళ్లాలంటే మాత్రం రాణిగంజ్‌ మార్గంలో వెళ్లాల్సిందే.