తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు.. పై నుంచి వస్తున్న వరదలతో భద్రాచలంలోని గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. 61.20 అడుగులకు వరద ఉధృతి చేరింది. భద్రాచలం దగ్గర గోదావరిలో 18,70,759 క్యూసెక్కుల ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. నేటి సాయంత్రానికి 70 అడుగులు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలం నుంచి పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రాకపోకలను నిలిపివేయడం బ్రిడ్జి చరిత్రలోనే ఇది రెండో సారి. దీంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్కూ రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో 1986లో నీటిమట్టం 75.6 చేరుకోవడంతో ఈ మేరకు ఆంక్షలు విధించారు. తాజాగా 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలపాటు వారధిపై రాకపోకలు బంద్ కానున్నాయి. సాయంత్రం 5 గంటలనాటికి ఇక్కడ వరద మట్టం.. 61.80 అడుగులుగా ఉంది. ఇదిలా ఉండగా.. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఇప్పటికే భద్రాచలం పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే.