హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు బండి సీజ్ చేయడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైన్ తర్వాత కడతానని ఎంత బతిమాలినా బండి ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రాఫిక్ ఎస్సైపై కేసు బుక్ చేశారు.
హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగల్‌లోని ఓ రెడీమేడ్ షో రూంలో సేల్స్ మెన్‌గా పని చేస్తున్నారు. ఈనెల 21న డ్యూటీ ముగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపారు. వివరాలు పరిశీలించగా 15 చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని తర్వాత చెల్లిస్తానని మొగిలి పోలీసులతో మొరపెట్టుకున్నారు. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితుడు నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు.
పోలీసుల చర్యతో మనస్తాపానికి గురైన మొగిలి మరుసటి రోజు ఉదయం గడ్డి మందు తాగాడు. అపస్మారకస్థితికి చేరుకోవడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ట్రాఫిక్ పోలీసుల వైఖరి కారణంగానే మొగిలి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ట్రాఫిక్ ఎస్సైతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన హసన్‌పర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.