న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10:00 నుంచి జనవరి ఒకటవ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు పోలీసులు. అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10:00 నుండి తెల్లవారు 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డు పై పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పైన వాహనాలను అనుమతించరు. అయితే ఎయిర్ పోర్ట్కు వెళ్లే వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
అలాగే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, జేఎన్టీయూ ఫ్లైఓవర్, గచ్చిబౌలి శిల్ప లేఅవుట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ పార్క్ ఫ్లైఓవర్ లెవెల్ 1, లెవెల్ 2, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, షేక్ పేట ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లై ఓవర్, బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్ లో వాహనాలను అనుమతించరు. అయితే టాక్సీలు, క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణానికి నిరాకరించకూడదని సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి బండి నడిపితే రూ.10 వేలు జరిమానా విధించనున్నారు.