హైదరాబాద్‌లో విషాదం.. స్టేజ్‌పై నుంచి పడి డీఎస్పీ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో విషాదం.. స్టేజ్‌పై నుంచి పడి డీఎస్పీ మృతి

May 19, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేష్ మృతి చెందారు. శిల్పకళావేదికలో దివంగత సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు అమ్మిరేష్ వచ్చారు.

ఈ క్రమంలో ఆయన శిల్పకళా వేదికలోని స్టేజ్‌పై నిలుచుని ఫొటోలు తీస్తుండగా, పొరపాటున స్టేజ్ ముందు ఉన్న గుంతలో పడిపోయారు. దాంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అమ్మిరేష్‌ను అక్కడివారు వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయం తగలడంతో… చికిత్స చేస్తుండగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అమ్మిరేష్ స్వస్థలం బీహార్ రాజధాని పాట్నాగా పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని ఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన మృతి పట్ల పోలీసు అధికారులు నివాళిలు అర్పించారు.