ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన సిద్దు సుమలత (22) గతకొన్ని రోజుల క్రితం ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, శుక్రవారం తిరుపతిలో చికిత్స పొందుతున్న సిద్దు సుమలత మృతి చెందింది. మండల పరిషత్తు మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు సిద్దు వెంకటసుబ్బారెడ్డి, లక్ష్మీ నరసమ్మ దంపతుల రెండో కుమార్తె సుమలత. ఆమె బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 18న తన ఇంటిలో మంచంపై కూర్చొని విధులు నిర్వహిస్తుండగా ఛార్జింగ్ పెట్టిన ల్యాప్‌టాప్ ఒక్కసారిగా పేలింది.
దీంతో పరుపు మంచానికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమలత ఉద్యోగంలో చేరి మూడునెలలే అయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.