తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో శ్రీరామనవమి పండగ రోజున ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇద్దరు చిన్నారులు ఆలయం వద్ద మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. కళ్లు మూసి, తెరిచేలోపే చిన్నారులు మృతి చెందడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి శ్రీరామనవమి సందర్భంగా భజన చేసేందుకు మండలంలోని తుమ్మలపల్లికి చెందిన ఆదినారాయణతో సహా 20 మంది పల్లిపాడుకు వచ్చారు.
అయితే, వారంతా కలిసి భజన ప్రారంభించారు. అంతలోనే పల్లిపాడు నుంచి దిద్దుపుడి వైపు వెళ్తున్న ఓ బొలోరో వాహనం అదుపుతప్పి ఆలయంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఆదిరానాయణ కుమార్తెలు అయిన పగడాల సహస్ర (9), పగడాల దేదీప్య (8)లను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా ప్రమాద సమయంలో ఆలయంలోనే ఉన్న మరో బాలిక అలేఖ్య, బొలేరో వాహన డ్రైవర్, అతడి పక్కన కూర్చున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.