మరోమారు హైదరాబాద్లో వాన బీభత్సం కారణంగా ఓల్డ్ మలక్ పేటలో ఓ వ్యక్తి ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా కరెంట్ స్తంభం పట్టుకుని షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములుగా పోలీసులు గుర్తించారు. తాజాగా ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. నెల్లూరులో కరెంట్ షాక్ కొట్టి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీ కాలనీలో ఒక ఇంటి ప్రధాన గేటుపై 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాటిని గమనించకుండా ఇంటి యజమాని టీచర్ వేణుగోపాల్(56) గేటు తీశాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
అయితే భర్తను రక్షిద్దామని ఆయన భార్య మరియమ్మ(52) ఏం ఆలోచించకుండా వెళ్లి వేణుగోపాల్ చేయి పట్టుకుని లాగింది. దీంతో ఆమెకు కూడా షాక్ కొట్టింది. అప్పుడే కొడుకు, కోడలును కాపాడుదామని తల్లి బజ్జమ్మ(70) కూడా వచ్చి వేణుగోపాల్ చేయి పట్టుకుంది. దీంతో ఆమెకు కూడా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే ముగ్గురూ ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చనిపోవడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.