పాకిస్తాన్‌లో దాడి.. 30 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో దాడి.. 30 మంది బలి

March 4, 2022

13

పాకిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. పెషావర్ అనే నగరంలో ఓ మసీద్‌లో బాంబు పేలి సుమారు 30 మంది మృతిచెందారు. మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం మసీదులో ప్రత్యేక ప్రార్థనల చేస్తున్న సందర్భంగా ఈ సూసైడ్‌ అటాక్‌ జరిగిందని పెషావర్‌ పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు.

ఈ ఘటనపై పెషావర్ సిటీ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ”ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా మృతి చెందాడు. 30 మంది మృతదేహాలను ఆస్పత్రికి తీసుకెళ్లాం. మసీదులోకి ఇద్దరు దుండగులు చొరబడే ప్రయత్నం చేశారు. అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపి, ఈ ఘటనకు పాల్పడ్డారు” అని తెలిపాడు.

మరోపక్క ఎన్నోఏళ్ల తర్వాత ఈరోజు రావల్పిండిలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి రావాల్సి వుంది. అంతలోనే ఈ దారుణ ఘటన జరగడం కలకలం రేపింది.