Tragedy in Tollywood..Actor Guruswamy passed away
mictv telugu

టాలీవుడ్‌లో విషాదం..నటుడు గురుస్వామి మృతి

September 10, 2022

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు గురుస్వామి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 15 రోజుల కిందట ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ అస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కర్నూలు జిల్లా బాలాజీనగర్‌లోని తన స్వగృహానికి వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లోనే వైద్యం చేయిస్తుండగా శుక్రవారం సాయంత్రం ఆయన మృతి చెందారు.

నటుడు గురుస్వామి..మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి’ సినిమాలో రైతు పాత్రలో నటించి, ప్రేక్షకుల మనసులలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. మహర్షి సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన (గురుస్వామి) తన వ్యక్తిగత జీవితం గురించి, సినిమా రంగం వైపు అడుగులు పడడానికి కారణాలెంటో వెల్లడించారు.

గురుస్వామి మాట్లాడుతూ..”మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా వెల్దుర్తి. మాది పెద్ద కుటుంబం. ఆ రోజుల్లోనే మా తల్లిదండ్రులు చదువు విషయంలో మమ్మల్ని బాగా ప్రోత్సాహించారు. వారి ప్రోత్సాహం కారణంగానే నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించాను. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను సినిమా రంగంవైపు వచ్చాను. 1973లో విజేత ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి ఎన్నో సాంఘిక నాటక ప్రదర్శనలు ఇచ్చాను. ఆ తర్వాత ‘ఆయుష్మాన్ భవ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో వృద్ధుడి పాత్ర ధరించాను. కారు క్లీనరుగా నటించిన తీరు నచ్చి, నటుడు మహేష్ బాబు, దర్శకులు వంశీ ఆహ్వానించి నాకు ‘మహర్షి’ సినిమాలో అవకాశం ఇచ్చారు” అని ఆయన అన్నారు.

‘మహర్షి’ సినిమాతో గురుస్వామికి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆయన నటనకు, డైలాగులకు ఆకర్షితులైన పలువురు ఆయనను అభినందించారు. ఆ తర్వాత ‘భీష్మ’, ‘సోలో బతుకే సో బెటర్’, ‘రిపబ్లిక్’, ‘వకీల్‌ సాబ్’ తదితర చిత్రాల్లో నటించి, అందరి మన్ననలు పొందారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు నివాళులు అర్పించారు.